- గడిచిన మూడు సీజన్ల కంటే తగ్గిన సాగు
- మూసీ పరివాహక మండలాల్లోనే ఎక్కువ సాగు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వానాకాలం వరి సాగు భారీగా తగ్గిపోయింది. కాలం ముఖం చాటేయడంతో ఈసారి వానలు సరిగ్గా లేవు. దీంతో సాగు చేయడానికి రైతులు వెనకడుగు వేశారు. గడిచిన మూడేండ్ల కంటే ఈసారి సాగు తగ్గిపోయింది.
మూసీ పరిధిలోనే ఎక్కువ సాగు
వానలు సరిగా కురవకపోవడంతో ఈసారి సాగు తగ్గుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఈసారి 2.85 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని భావించారు. అయితే వానాకాలం సీజన్ మొదలై మూడు నెలలు కావస్తున్నా జిల్లాలో ఒక్క భారీ వాన కురియలేదు. మూసీ పరిధిలోని వలిగొండ, రామన్నపేట, పోచంపల్లి సహా 14 మండలాల్లో వరి నాట్లు తక్కువగా వేశారు.
పొలాలు దున్ని రెడీగా ఉన్నా, నారు రెడీగా ఉన్నా వానలు కురియకపోవడం, బోర్ల నుంచి సరిగా నీరు రాకపోవడంతో నాట్లు వేయలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల లెక్కల ప్రకారం జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇందులో 88,686 ఎకరాలు మూడు మూసీ పరివాహక మండలాల్లోనే ఉన్నాయి.
గత సీజన్ కంటే తగ్గిన 70 వేల ఎకరాలు
వానలు లేకపోవడంతో గడిచిన మూడు సీజన్ల కంటే వరి సాగు తగ్గింది. 2021లో 2.80 లక్షల ఎకరాలు, 2022లో 3 లక్షల ఎకరాలు, 2023 సీజన్లో 3.05 లక్షల ఎకరాలు సాగు చేశారు. ఈ సీజన్లో 2.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన గత సీజన్ కంటే ఈ సీజన్లో 70 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. మూసీ పరివాహక మండలాల్లోని వలిగొండ, రామన్నపేట, పోచంపల్లి మండలాల్లో సైతం ఈసారి సాగు తగ్గింది.
ఈ మూడు మండలాల్లో గతేడాది 1,00,630 ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి 88,686 ఎకరాల్లోనే నాట్లు వేశారు. జిల్లాలో గతేడాది 1.02 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా ఈసారి 1.01 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కందులు కూడా గతేడాది కంటే ఈసారి 200 ఎకరాల్లో తగ్గి 3162 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో వర్షపాతం సాధారణంగా నమోదైంది. అయితే మూడు మండలాల్లో ఇంకా లోటుగానే ఉంది.
సాధారణ వర్షపాతం 370 మిల్లీ మీటర్లు కురియాల్సి ఉండగా దాదాపు అంతే నమోదైంది. అయితే జిల్లాలోని చౌటుప్పల్, అడ్డగూడురు, గుండాల మండలాల్లో వర్షపాతం లోటు నమోదైంది. వానలు కురియక పోవడం వల్ల జిల్లాలోని చెరువులు, కుంట్లలో నీరు సరిగా చేరలేదు.
జిల్లాలో ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో గతం కంటే భూగర్భజలాలు మరింత తగ్గిపోయాయి. గతేడాది ఈ సీజన్ కంటే 6.16 మీటర్ల దిగువకు భూగర్భజలాలు పడిపోయాయని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.