అకాల వర్షాలకు తడిసి పాడవుతున్న వడ్లు

మెదక్​ (శివ్వంపేట, నిజాంపేట), వెలుగు: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది.  వారం, పది రోజుల కిందనే వరి కోతలు మొదలైనా.. చాలాచోట్ల సెంటర్లు ఓపెన్ చేయలేదు. దీంతో రైతులు వడ్లను సెంటర్‌‌ ఏర్పాటు చేసే ప్రదేశాలతో పాటు రోడ్లపై పెద్ద ఎత్తున రాశులు పోసి ఎదురుచూడాల్సి వస్తోంది.  కానీ, నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి.   నిర్వాహకులు టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదని, ఆరుగాలం కష్టం నీటిపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొన్నది 1843 మెట్రిక్ టన్నులే 

ఈ యాసంగి సీజన్​లో మెదక్‌ జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా..  4.43 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రికల్చర్‌‌ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్​ డిపార్ట్​మెంట్​ల ఆధ్వర్యంలో 402 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ఈ మేరకు రైతులు వరికోతలు మొదలు పెట్టారు. హార్వెస్టర్లతో నూర్పడి చేస్తుండటంతో వెంటవెంటనే కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు.  అయితే  సివిల్‌ సప్లై, మార్కెటింగ్ అధికారులు ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 22, పీఏసీఎస్​ఆధ్వర్యంలో 220 కలిపి  236 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఓపెన్​ చేశారు.   ఇందులోనూ చాలాచోట్ల వసతులు లేకపోవడంతో కాంటా పూర్తి స్థాయిలో జరగడంలేదు. ఇప్పటి వరకు 242 మంది రైతుల నుంచి 1843 మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  అనేక సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలుగా పోసి రైతులు పడిగాపులు గాస్తున్నారు.

ఎండేలోపే మళ్లీ వాన

గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మార్కెట్​ యార్డుల్లో, కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోయాయి.  ఒక రోజు నానిన వడ్లు ఎండేలోపే మళ్లీ వాన పడుతోంది. దీంతో కొల్చారం మండలం నాయిని జలాల్​పూర్​, అప్పాజిపల్లి, రంగంపేట, చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో వడ్లు నాని మొలకలు వచ్చాయి.  తడిసిన వడ్లకు కొంటామని అధికారులు చెబుతున్నా.. పూర్తిస్థాయిలో గైడ్‌లైన్స్‌ రాకపోవడంతో వెనకడుగు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాళ్లు కొనేలోగా పూర్తిగా మొలకెత్తేలాగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.