- ట్యాబ్‌లో ఎంట్రీకి ఆలస్యం చేస్తున్న నిర్వాహకులు
- పైసల కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు
కామారెడ్డి, వెలుగు: వరికోతలు షురూ అయిన్నుంచి రైతులకు అరిగోస తప్పడం లేదు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని,పెట్టిన లాగోడి పైసలన్న వస్తే చాలనుకున్న రైతులకు ఎదురుచూపులే దిక్కవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో రైతులకు వడ్లమ్మిన పైసలు రావడంలో డిలే అవుతోంది. ప్రధానంగా కాంట పెట్టిన తర్వాత సంబంధిత రైతు వివరాలు, అతడి నుంచి సేకరించిన ధాన్యం వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలి. అప్పడు ట్రక్‌షీట్ జనరేట్అవుతుంది. ఈ ప్రాసెస్ డిలే అవుతుండడంతో సకాలంలో రైతుల అకౌంట్లో డబ్బులు జమ కావడం లేదు. క్షేత్రస్థాయిలో ఆఫీసర్ల పర్యవేక్షణ లేక కాంటా అయిన తర్వాత కూడా సెంటర్లలో రైతుల వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
10 నుంచి 12 రోజులు పడుతుంది..
కొనుగోలు సెంటర్లలో కాంటా పెట్టిన తర్వాత రైతుల వివరాలు వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తే ట్రక్షీట్జనరేట్అవుతోంది. ఆ తర్వాత రైస్‌మిల్లులో అన్ లోడ్ చేస్తే, వీళ్లు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత రైతుల అకౌంట్లో పైసలు పడ్తాయి. కాంట పెట్టిన 24 గంటల్లో రైతుల అకౌంట్లలో పైసలు జమ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కాంటా అయిన 3 నుంచి 5 రోజుల వరకు కూడా సిబ్బంది ట్యాబ్‌లో ఎంట్రీ చేయడం లేదు. ఎంట్రీ తర్వాత పైసలు అకౌంట్లలో జమ అయ్యేందుకు మరో వారం పడుతోంది. మొత్తం మీద కాంటా చేసిన 10 నుంచి 12 రోజుల వరకు పైసలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటాం..
సెంటర్లలో వడ్లు అమ్మిన రైతులకు సకాలంలో పైసలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంటా అయిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ జరగాలి. ఇందుకు రైతులు వారి పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలి. కాంట కాగానే ఎంట్రీ చేసేలా చూస్తున్నాం.
పరిస్థితి ఇలా...
జిల్లాలో ఈ సీజన్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అమ్మకానికి వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. 321 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రూ.388.69 కోట్ల విలువైన 1,88,685 మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించారు. రూ.262.02 కోట్ల విలువైన 1,27,193 మెట్రిక్ టన్నులకు సంబంధించిన వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేశారు. 1,16,168 మెట్రిక్‌టన్నుల వడ్లకు సంబంధించి ట్రక్షీట్లు జనరేట్ అయ్యాయి. వీటి విలువ రూ.239.31 కోట్లు మాత్రమే. ఇప్పటి వరకు 1,04,368 మెట్రిక్ టన్నుల వడ్లకు సంబంధించి రూ.215 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇంకా రూ.174 కోట్ల అమౌంట్ పెండింగ్‌లో ఉంది.