- సెంటర్లలో బాధలు పడలేక.. నగదు కోసం ఆగలేక ట్రేడర్ల వైపు మొగ్గు
- సర్కార్ 1.10 లక్షల టన్నులు కొంటే.. దళారులు కొన్నది లక్ష టన్నులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు ధీటుగా దళారులు కూడా వడ్లను కొనుగోలు చేస్తున్నారు. వారు వడ్ల క్వాలిటీని పట్టించుకోకపోవడమే కాకుండా స్పాట్ క్యాష్ ఇస్తుండడంతో రైతులు కూడా వారికే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. దళారులు కొనుగోలు చేసిన వడ్లను జిల్లాలోని రైస్ మిల్లులతో పాటు, ఏపీలోని కాకినాడలో గల రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడలేక...
యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు. జిల్లాలో మొత్తంగా 3.05 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 6.60 లక్షల టన్నుల వడ్లు దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 20,234 ఎకరాల్లో సన్నొడ్లు పోగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మార్కెట్ వస్తాయని లెక్కలు వేశారు. దీంతో వడ్ల కొనుగోలు కోసం సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ద్వారా పీఏసీఎస్ ఆధ్వర్యంలో 213, ఐకేపీ ఆధ్వర్యంలో 80, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 8, మార్కెట్‌లో 2 సెంటర్లు కలిపి మొత్తం 303 సెంటర్లు ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు తాలు, తేమ, నూక పేరుతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ 40 కిలోల బస్తాకు 2 కిలోలు కటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వెయిట్ చేయాల్సి రావడంతో పాటు, వడ్లకు సరైన తేమ వచ్చే వరకు ఆరబెట్టాల్సి వస్తోంది. ఇదే టైంలో కొందరు దళారులు రంగంలోకి దిగి ఎలాంటి కొర్రీలు లేకుండా క్వింటాల్‌కు రూ. 1,800 చొప్పున ఇస్తామని, ఇందులో కటింగ్, కమీషన్ పోను రూ. 1,600 వరకు వస్తుందని రైతులకు చెబుతున్నారు. తూకం వేసిన వెంటనే డబ్బులు ఇస్తామని ఒప్పుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతూ, డబ్బుల కోసం వెయిట్ చేయాల్సి వస్తుండడంతో విసిగిపోయిన రైతులు దళారులకు అమ్మేందుకు
ఒప్పుకుంటున్నారు.
సర్కారుకు ధీటుగా...
యాదాద్రి జిల్లాలో గత నెల చివరి వారం నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. అయితే సర్కారు ఏర్పాటు చేసిన వందలాది సెంటర్లతో సమానంగా దళారులు కూడా ఎక్కడికక్కడ వడ్లను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే లక్ష టన్నుల వడ్లను దళారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
యాదాద్రి టు కాకినాడ
యాదాద్రి జిల్లాలో దళారులు కొనుగోలు చేసిన వడ్లలో కొన్నింటిని స్థానికంగా ఉన్న రైస్ మిల్లులకు తరలిస్తుండగా, మరికొంత ధాన్యాన్ని ఏపీలోని కాకినాడలో ఉన్న రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఏపీలో వడ్ల దిగుబడి తక్కువగా రావడంతో అక్కడి మిల్లర్లు తెలంగాణ జిల్లాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్థానిక దళారులతో ఒప్పందం చేసుకొని వడ్లను కొనుగోలు చేసి ఏపీకి తీసుకెళ్తున్నారు.