
- వడ్ల కొనుగోలు సెంటర్ల వద్దే.. ట్రక్ షీట్, ట్యాబ్ ఎంట్రీ
- అక్రమాలకు చెక్ పెట్టేలా యాదాద్రి జిల్లా ఆఫీసర్ల ఫోకస్
- ప్రతి వడ్ల బస్తాకు పక్కాగా టోకెన్, బై నంబర్ల కేటాయింపు
- రైతులకు మేలు కలిగేలా వెంటనే నిర్ణయాలు, అమౌంట్ చెల్లింపు
- ఈనెలాఖరు నుంచి యాసంగి సీజన్ వడ్ల కొనుగోలు షురూ
యాదాద్రి, వెలుగు: యాసంగి సీజన్ వడ్ల కొనుగోలులో అక్రమాలకు చెక్ పెట్టేందుకు యాదాద్రి జిల్లా ఆఫీసర్లు చర్యలు చేపట్టారు.రూల్స్కు అనుగుణంగా వడ్ల కొనుగోలు సాఫీగా సాగేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులకు మేలు కలిగే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వడ్ల కాంటాతోపాటు ట్రాన్స్పోర్ట్ లోనూ ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. దీంతో ఏ లారీ ఏ సెంటర్ నుంచి బయలు దేరింది. ఏ మిల్లుకు ఏ సమయంలో చేరిందో తెలిసిపోతుంది. వెంటనే అన్లోడ్ జరిగే విధంగా చర్యలు తీసుకునే చాన్స్ కూడా ఉంది. దీంతో రైతులకు డబ్బులు కూడా వెంటనే ఖాతాలో పడే అవకాశం ఉంటుంది.
నెలాఖరు నుంచి కొనుగోలు
జిల్లాలో యాసంగి సీజన్లో ఈసారి వరి సాగుకే రైతులు ప్రయారిటీ ఇచ్చారు. 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా. ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా ఉత్పత్తి వస్తుందని, తద్వారా 7 లక్షల టన్నుల దిగుబడి రానుందని లెక్కలు వేశారు. ఈనెలలోనే యాసంగి సీజన్ వడ్ల కోతలు షురూ కానున్నాయి. దీంతో వడ్ల కొనుగోలుకు జిల్లాలో 372 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 4.50 లక్షల టన్నుల ధాన్యం రానుందని అధికారులు అంచనా వేశారు.
గతంలో ఇలా..
వడ్ల కొనుగోలులో గతంలో రూల్స్కు విరుద్ధంగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించేవారు. రూల్స్ ప్రకారం బస్తాకు 40.638 కిలోలు కాంటా పెట్టాల్సి ఉండగా తేమ, తాలు పేరుతో 42 కిలోలు కాంటా వేసేవారు. కాంటా వేసిన వడ్లు మిల్లుకు చేరిన తర్వాత వచ్చిన వడ్ల బస్తాల్లో ఒక్కో రైతుకు ఒక్కో విధంగా కోత పెట్టి ట్రక్షీటు, ట్యాబ్ ఎంట్రీ చేసేవారు. తద్వారా వడ్ల అన్లోడ్లో ఆలస్యం అవుతుండగా గందరగోళం నెలకొనేది. దీంతో కొనుగోళ్లు ఆలస్యమయ్యేది. రైతులకు నష్టం జరగడంతో పాటు డబ్బులు కూడా లేట్ గా వచ్చేవి. దీంతో ప్రతి సీజన్లో వడ్ల కొనుగోలులో అయోమయం చోటు చేసుకునేది.
సెంటర్ల వద్దే ట్యాబ్ ఎంట్రీ..
వడ్లలో తాలు, తేమ, మట్టి లేకుండా రైతులు తీసుకొస్తున్నా.. కావాలని కొందరు సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆఫీసర్ల దృష్టికి వచ్చింది. దీంతో అక్రమాలకు చెక్పెట్టేందుకు జిల్లాఫీసర్లు ప్లాన్ తయారు చేశారు. ఒక్కో బస్తాను 41 కిలోల వడ్లను తూకం వేసిన తర్వాత ట్రక్షీటుతో పాటు ట్యాబ్ఎంట్రీ కూడా కొనుగోలు సెంటర్లోనే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పైగా సెంటర్ వద్దకు వడ్లతో వచ్చిన రైతుకు టోకెన్ కేటాయిస్తారు.
కాంటా వేయగానే ప్రతి 41 కిలోల వడ్ల బ్యాగులపై రైతుకు చెందిన టోకెన్ నంబర్, బై నంబర్ కూడావేయాలని సూచిస్తున్నారు. దీని కారణంగా ఏ రైతు ఎన్ని వడ్లు అమ్మాడో వెంటనే తెలిసిపోతుంది. దీంతో మిల్లర్లు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదు. రైతులకు మేలు చేయనుంది. వడ్లలో తేమ, తాలు ఉందని సాకులు చెబుతూ వడ్లను ఎక్కువగా తూకం వేసే చాన్స్ లేదు. నాణ్యత పేరుతో రిజెక్ట్ చేస్తే డీఏవో, డీఎస్సీవో, ఆర్డీవో,ఎంపీడీవోలతో వేర్వేరుగా వేసిన కమిటీలు నాణ్యతను పరిశీలిస్తారు. అదేవిధంగా ప్రతి లారీకి జీపీఎస్ట్యాగ్వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.