వడ్ల కొనుగోళ్లు వెరీ స్లో.. మంత్రి సీరియస్​

 

  •      లక్ష్యం లక్షల టన్నులు..  కొన్నది  వేల టన్నులే
  •      ఉమ్మడి జిల్లాలో పేరుకు పోయిన ధాన్యం కుప్పలు 
  •      రంగంలోకి దళారులు..  తక్కువ రేటుకే కొనుగోలు


యాదాద్రి/సూర్యాపేట/మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు చాలా స్లోగా సాగుతున్నాయి. లక్షల టన్నుల లక్ష్యం ఉంటే రెండు వారాల నుంచి ఇంకా వేల టన్నుల్లోనే కొనుగోళ్లు ఉన్నాయి. దీంతో సెంటర్ల నిం డా వడ్ల కుప్పలు పేరుకుపోయాయి. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లాలో యాసంగి సీజన్​లో 2.90 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. మొత్తంగా 6.09 లక్ష ల మెట్రిక్​ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆఫీ సర్లు అంచనా వేశారు. దీంట్లో 5 లక్షల మెట్రిక్​ టన్నులను కొనుగోలు చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలో 4.55 లక్షల ఎకరాల్లో  దొడ్డు వడ్లు సాగు చేయగా 11.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ది గుబడి రానుందని అంచనా వేశారు. ఇందులో 8 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సెంటర్లకు రానున్నట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 7 లక్షల మెట్రిక్​ టన్నుల కొనుగోళ్లు చేస్తామని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 


ఆలస్యం చేసిన్రు.. 


మార్చి చివరి వారం నుంచే వరి కోతలు ప్రారంభమైనా ఆఫీసర్లు మాత్రం ఏప్రిల్​ చివరి వారంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. మార్చి 18 నుంచి 20, ఆ తర్వాత ఏప్రిల్​4 నుంచి తరచూ కురిసిన వానల కారణంగా రెండో వారం నాటికి దాదాపు యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో 40 వేల ఎకరాల్లో పంట పాడైంది.  అయితే మార్చి చివరి వారంలోనే కోతలు ప్రారంభించిన రైతులు, వడ్లను ప్రతిపాదిత సెంటర్లకు తరలించారు. సెంటర్లకు వడ్లు తీసుకొచ్చినా, కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, వానలు పడుతుండడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఏప్రిల్​ 19 నుంచి కొనుగోలు సెంటర్ల ప్రారంభం మొదలైంది. యాదాద్రి జిల్లాలో 324 సెంటర్లకు 190 సెంటర్లను విడతల వారీగా ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో 296 సెంటర్లకు 288 ఓపెన్ చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 346 సెంటర్లకు అన్నీ  ప్రారంభించారు.


ఊపందుకోలే.. 


సెంటర్లు ప్రారంభించినా వడ్ల కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. రెండు వారాల నుంచి యాదాద్రి జిల్లాలో కేవలం 18 వేల మెట్రిక్​ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 80 వేల మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేశారు. నల్గొండ జిల్లాలో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు.  సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం  సెంటర్ల వద్ద ఉంది. వానల వల్ల వడ్లలో తేమ శాతం పెరిగిందని, మిల్లర్లు తీసుకోవడానికి ఇష్ట పడడం లేదంటూ ఆఫీసర్లు చెబుతున్నారు. 


ఇదే అదనుగా దళారుల దందా.. !


కొనుగోళ్లు స్పీడప్ ​కాకపోవడంతో సెంటర్లలో వడ్ల కుప్పలు పేరుకుపోయాయి. ఇదే అదనుగా దళారులు రంగంలోకి దిగారు. క్వింటాల్​వడ్లకు ప్రభుత్వ మద్దతు రూ. 2040 ఉంటే దళారులు మాత్రం రైతులకు మాయమాటలు చెబుతూ రూ. 1700కే కొనుగోలు చేస్తున్నారు. ఎలా ఉన్న వడ్లను అలాగే తీసుకెళ్తామని చెబుతుండటంతో రైతులు వారి వలలో పడుతున్నారు. దీనికితోడు వరుసగా వానలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చాయి.  కొనుగోళ్లు ఊపందుకోలేదు. తేమ, తాలు ఉందని ఆఫీసర్లు కొర్రీలు  పెడుతున్నారు. ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లో ధర తక్కువైనా రైతులు వడ్లను దళారులకు 
అమ్ముకుంటున్నారు.

 
మంత్రి సీరియస్​

 
వడ్ల కొనుగోలుపై మంత్రి జగదీశ్​రెడ్డి ఇటీవల సూర్యాపేటలో రివ్యూ నిర్వహించారు. ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల టన్నుల టార్గెట్​ ఉంటే.. వేల టన్నులే కొంటే ఎలా..? అని ప్రశ్నించారు. వేగంగా కొనుగోళ్లు చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  


వడ్లు జల్ది కొంటలేరు.. 


కేంద్రల్లో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నా సారోళ్లు ఇంకా కొంటలేరు. వాన పడుతోంది. వడ్లు తడిసే పరిస్థితి ఉంది. ఇక రోజుల తరబడి ఆగడం కంటే అమ్ముకునేడే మంచిదని తక్కువ ధరకే ఇచ్చేస్తున్నం. 
- మల్లయ్య, రైతు, అనంతారం

స్పీడప్ చేస్తున్నాం 


ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 346 పీపీసీ సెంటర్లు ప్రారంభమయ్యాయి. కాంటాలను స్పీడప్ చేశాం. మిల్లుల్లో వడ్లను కూడా వేగంగా దించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
- డీఎస్ వో వెంకటేశ్వర్లు, నల్గొండ