సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. మిల్లులకు భారీ మొత్తంలో వడ్లు వస్తుండడంతో ఇదే అదనుగా భావించి వారు రేటును అమాంతం తగ్గించేశారు. దీంతో రైతులు వడ్లు అమ్మకుండా ఇండ్లలోనే దాచిపెట్టుకుంటున్నారు. ఈ కారణంతో సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్‌లో వడ్ల కొనుగోళ్లు అనుకున్న టార్గెట్‌ను చేరుకోలేదు. ముందుగా పెట్టుకున్న టార్గెట్‌లో మూడో వంతు వడ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. మిల్లులకు వడ్లు రాక ఆగిపోవడంతో ఆఫీసర్లు కొనుగోలు సెంటర్లను మూసివేస్తున్నారు.
కొన్నది 2.24 లక్షల క్వింటాళ్లే...
సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్‌లో 260 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఆఫీసర్లు మొత్తం 6 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో రైతుల అసౌకర్యాలకు తోడు తేమ పేరుతో నిర్వాహకులు కోతలు పెట్టడంతో రైతులు ప్రైవేట్ బాట పట్టారు. దీంతో
ఇప్పటివరకు 2,24,474 టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 102 కేంద్రాలు మూతబడ్డాయి. మరి కొన్ని కేంద్రాలను త్వరలోనే మూసేసే పరిస్థితి ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మరో 30 వేల టన్నుల కంటే ఎక్కువ వడ్లు వచ్చే పరిస్థితి లేదన ఆఫీసర్లు అంటున్నారు.
ధర తగ్గించిన మిల్లర్లు
జిల్లాలో ఈ సీజన్ లో ఎక్కువగా సన్నొడ్లు పండడంతో హుజూర్ నగర్, నేరేడుచర్ల, కోదాడ, గరిడేపల్లి, ఏరియాలోని రైతులు మిర్యాలగూడ రైస్ మిల్లలకు తరలిస్తుండగా సూర్యాపేట, పెన్‌పహాడ్, ఆత్మకూర్(ఎస్) పరిధిలోని రైతులు సూర్యాపేట మార్కెట్, సూర్యాపేట, హుజూర్ నగర్, గరిడేపల్లి మిల్లులలో అమ్ముకుంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభమైన మొదట్లో క్వింటాళ్ రూ.2,400 పైగా చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం రూ.1,700కు మించి కొనుగోలు చేయడం లేదు. రైతుల పరిస్థితిని అదునుగా భావిస్తూ.. తాలు, పచ్చి గింజ ఉందంటూ ధర తగ్గిస్తున్నారు.
వడ్లు దాచుకుంటున్న రైతులు
ఒక పక్క మిల్లర్ల దోపిడీ, మరో పక్క కొనుగోలు కేంద్రాల్లో కోతలు పెడుతుండడంతో కొందరు రైతులు ధాన్యాన్ని ఇండ్లలోనే దాచుకుంటున్నారు. పక్క రాష్ట్రాలలో సన్నొడ్లకు మంచి డిమాండ్ ఉండడంతో ఇంకొన్ని రోజులు నిరీక్షించి మంచి ధరకే అమ్ముకుంటామని చెప్తున్నారు. ఈ వానాకాలం సీజన్ లో జిల్లాలో1.86 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు 11.89లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించారు.
ధర లేక అమ్ముకోవట్లే
నాలుగెకరాల్లో సాంబ మసూరి సాగు చేశాను.130 బస్తాలు పండించాను. లింగగిరి సొసైటీ లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే. మిల్లులో అమ్ముదామంటే మధ్యవర్తి బాగా తక్కువ ధరకు క్వింటాల్రూ.1400 అడుగుతుండు. దీంతో ఆరబెట్టి ప్రైవేట్గోదాం కిరాయికి తీసుకుని వడ్లు స్టాక్చేశాను. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుంటా.
- రణపంగు కిశోర్, లక్కవరం, హుజూర్ నగర్
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావట్లే
వాతావరణ మార్పులతో వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో వడ్లు పచ్చిగానే ఉంటున్నాయి. దీంతో రైతులను ఎండబెట్టి తీసుకురావాలని సలహా ఇస్తున్నాం. ఈ సారి బయట మార్కెట్లో ధర మంచిగ ఉండడంతో రైతులు వడ్లు నిల్వ చేసుకుంటున్రు. దీంతో కొనుగోళ్లు తగ్గాయి.
- రాంపతి, డీఎం, సివిల్ సప్లై శాఖ, సూర్యాపేట