దొడ్డు బియ్యాన్ని సన్నాలుగా మారుస్తున్నరు

  •     రీసైక్లింగ్‌‌‌‌‌‌‌‌ చేసి స్కూళ్లు, హాస్టళ్లకు సప్లై చేస్తున్నరు
  •     సీఎమ్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యంతో బిజినెస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న మిల్లర్లు
  •     జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సభ్యుల ఆగ్రహం 

నల్గొండ, వెలుగు : రేషన్​షాపుల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్నే రీసైక్లింగ్​చేసి సన్న బియ్యం పేరుతో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా పరిషత్​ సభ్యులు మండిపడ్డారు. శనివారం నల్గొండలో జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​ రెడ్డి అధ్యక్షతన జనరల్​ బాడీ సమావేశం జరిగింది. ఈ సమేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరు కాగా..  జడ్పీ చైర్మన్​ ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత స్టాండింగ్​ కమిటీల్లో వారికి చోటు కల్పించారు. అనంతరం వ్యవసాయం, విద్యుత్​, రోడ్లు, కోవిడ్​తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ..  ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టల్స్‌‌‌‌‌‌‌‌కు సప్లై చేస్తున్న సన్న బియ్యం నాసిరకంగా ఉంటోందని,  ఉడికిన తర్వాత మెత్తగా మారి వాసన వస్తుండడంతో విద్యార్థులు తినలేకపోతున్నారని మండిపడ్డారు. రేషన్​షాపుల్లో ఇస్తున్న బియ్యాన్ని లబ్ధిదారులు  కేజీ రూ.10 చొప్పున బ్లాక్​ మార్కెట్లో విక్రయిస్తున్నారని, అది దళారుల ద్వారా మిల్లుల్లోకి చేరుతుందని ఆరోపించారు.

దాన్నే సన్న బియ్యం గా రీసైక్లింగ్​ చేసి సప్లై చేస్తున్నారని, దీనిపైన సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్​చేశారు. మిల్లర్లు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద వచ్చిన వడ్లను గడువులోగా ఇవ్వకుండా  అక్రమంగా బిజినెస్​ చేస్తున్నారని ఆరోపించారు.  

కరెంట్​పోతున్నా పట్టించుకోవట్లే...

కరెంట్ ఆఫీసర్లుపెద్దవూర మండలంలో 200 పోల్స్‌‌‌‌‌‌‌‌ వేసి కొన్నింటికి మాత్రమే తీగలు బిగించారని మండిప్డడారు. మిగితా స్తంభాలను వెంచర్లకు అమ్ముకుంటున్నారని సభ్యులు ఆరోపించారు. కట్టంగూరు మండలంలో  15 గ్రామాలకు ఒకటే బ్రేకర్‌‌‌‌‌‌‌‌ ఉందని, దాంతో ఏ గ్రామంలో కరెంట్‌‌‌‌‌‌‌‌ పోయినా సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్​లు బ్రేక్​ డౌన్​ అయ్యి అన్ని గ్రామాలకు కరెంట్​ సప్లై ఆగిపోతుందని వాపోయారు. మునుగోడులోని ఓ స్కూల్‌‌‌‌‌‌‌‌లో సీబీఎస్ఈ పర్మిషన్​ లేకున్నా స్కూల్​నడపడమే కాదు విద్యుత్​ చౌర్యానికి పాల్పడుతున్నారని ఎంపీపీ ఆరోపించారు. 

రేషన్​ షాపులు ఏర్పాటు చేయాలి

కొత్త పంచాయతీల్లో డీలర్‌‌‌‌‌‌‌‌షాపులు ఏర్పాటు చేయాలని సభ్యులు డిమాండ్​ చేశారు. ఇప్పటికీ పాత పంచాయతీల్లోనే బియ్యం తెచ్చుకుంటు న్నారని, దీని వల్ల కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్టూడెంట్స్​ఉన్న చోట టీచర్లు తక్కువగా ఉన్నారని,  స్టూడెంట్స్​లేని చోట టీచర్లు ఎక్కువగా ఉన్నారని సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంఈవోలు స్టూడెంట్స్​ ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా వెళ్లడం లేదని మండిపడ్డారు.  పల్లె వెలుగు బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇరిగేషన్ పనుల రిపోర్ట్ ఇవ్వండి

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయ వీర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల నివేదికలను అందజేయాలని కోరారు. త్వరలో ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.  నకిరేకల్​ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. తాటికల్, కడపర్తి రోడ్లు దెబ్బతిన్నాయని,  ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ అధికారులు వెంటనే రిపేర్లు చేయాలని కోరారు.

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. చందంపేట మండలంలో ఒక్క ప్రభుత్వ స్కూల్​ కూడా లేదని వాపోయారు.  దీంతో అక్కడి పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు పోతున్నారని, సింగిల్ టీచర్ బడులు తెరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.   ఈ సమావేశంలో ఇన్​చార్జి కలెక్టర్​ హేమంత్​ కేశవ్​ పాటిల్​,  మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెడ్పీ సీఈ వో ప్రేమ్‌‌‌‌‌‌‌‌ కరణ్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కొత్త వైరస్‌‌‌‌‌‌‌‌పై  అప్రమత్తంగా ఉన్నాం 

 కోవిడ్ జేఎన్​–1 వైరస్ విషయంలో అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నామని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తెలిపారు.  ఆరోగ్య శాఖ తరఫున ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఆస్పత్రుల్లో రాపిడ్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు  ప్రత్యేక వార్డులు, బెడ్లును సిద్ధం చేస్తున్నామని చెప్పారు.  ప్రజలు  మాస్కులు ధరించాలని,  ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.