సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ముదిరాజ్ లపై ప్రచారం చేసిన వాయిస్ తనది కాదని.. తప్పుడు ప్రచారం చేసి తనను మానసిక వేదనకు గురిచేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేసినవి ఫేక్ వార్తలని.. ఇదంతా ఈటల రాజేందర్ చేయిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి ప్రమాణం చేయాలంటూ ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరారు.
ముదిరాజ్ బిడ్డలంటే తనకు ఎంతో గౌరవమన్నారు కౌశిక్ రెడ్డి. ముదిరాజ్ లపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని.. తాను పెద్దమ్మతల్లి మీద ప్రమాణం చేస్తున్నానని.. తాను అనని మాటలను అన్నట్లు ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కు చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ కెమెరామెన్ ను అసభ్య పదజాలంతో తిడుతున్న ఆడియో వైరల్ అయ్యింది. తనకు కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు అజయ్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాలు ఆందోళనకు దిగాయి. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.