- సెంచరీలతో మెరిసిన పడిక్కల్, అర్షిన్ కులకర్ణి
వడోదర: టీమిండియా ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (99 బాల్స్‌లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 102) సెంచరీకి తోడు బౌలర్లు సత్తా చాటడంతో నాలుగుసార్లు చాంపియన్ కర్నాటక విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరుకుంది. మహారాష్ట్ర జట్టు కూడా ముందంజ వేసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కర్నాటక 5 రన్స్ తేడాతో బరోడాపై ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కర్నాటక తొలుత నిర్ణీత 50 ఓవర్లలో 281/8 స్కోరు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (6) నిరాశపరిచినా.. కేవీ అనీశ్ (52)తో పడిక్కల్ రెండో వికెట్‌కు 133రన్స్ జోడించి మంచి స్కోరు అందించాడు.
బరోడా బౌలర్లలో రాజ్ లంబాని, అతీత్ సేథ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో బరోడా 49.5 ఓవర్లలో 276 రన్స్‌కు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ శాశ్వత్ రావత్ (104) సెంచరీ, అతీత్ సేథ్ (56) ఫిఫ్టీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. కర్నాటక బౌలర్లలో కౌశిక్, ప్రసిధ్ కృష్ణ, అభిలాష్ షెట్టి, శ్రేయస్ గోపాల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరో క్వార్టర్ ఫైనల్లో మహారాష్ట్ర 70 రన్స్ తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత మహారాష్ట్ర 50 ఓవర్లలో 275/6 స్కోరు చేసింది.
అర్షిన్ కులకర్ణి (107) సెంచరీ కొట్టగా.. అంకిత్ బావ్నే (60), చివర్లో నిఖిల్ నాయక్ (29 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్) ఫిఫ్టీలతో మెరిశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు, నమద్ ధీర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో పంజాబ్44.4 ఓవర్లలో 205 రన్స్‌కే ఆలౌటైంది. అర్ష్‌దీప్ సింగ్ (49), అన్మోల్ ప్రీత్ సింగ్ (48) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు, ప్రదీప్ దాదే రెండు వికెట్లు తీశారు. అర్షిన్ కులకర్ణికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో గుజరాత్‌తో హర్యానా, విదర్భతో రాజస్తాన్ తలపడతాయి.