
చిన్నశంకరంపేట, నిజాంపేట్, వెలుగు: నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సంస్కారం అనిపించుకోదని బీఆర్ఎస్ మెదక్అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ పై విరుచుకుపడ్డారు. ఆదివారం మండలంలోని గజగట్లపల్లి, కొండాపూర్, జంగరాయి తండా, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనపై, బతుకమ్మ ఆట పట్ల అవహేళన చేయడం సంస్కారం అనిపించుకోదన్నారు. నాణ్యతలేని చీరలు పంచుతున్నారని చెబుతున్న హనుమంతరావు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టు చీరలేమైనా పంచాడా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ పట్లోరి మాధవి, పార్టీ మండల అధ్యక్షుడు రాజు, బాలకృష్ణ, రమణ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ పాల్గొన్నారు.
నిజాంపేట్ లో..
మెదక్ ఎమ్మెల్యే గా రెండు సార్లు గెలిచి మీరు చేసిన డెవలప్మెంట్ఏంటో చూపించాలని.. అలాగే తాను చేసిన పనులను చూపిస్తానని పద్మాదేవేందర్ రెడ్డి మైనంపల్లి హన్మంత్ రావుకు సవాల్ విసిరారు. ఆదివారం నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట,నార్లాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాల్లో ఏమీ తెలవని పిలగాన్ని ఎమ్మెల్యే గా గెలిపిస్తే మెదక్ ఐదేండ్లు వెనక్కు పోతుందన్నారు. కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పార్టీ మండల ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ సిద్దరాములు, నాయకులు భాస్కర్ రావు, కొండల్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, నాగరాజు పాల్గొన్నారు.