పాపన్నపేట, వెలుగు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని బీఆర్ఎస్మెదక్అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని యూసుఫ్పేట, ఆరేపల్లి, కుర్తివాడ, దౌలాపూర్, మిన్పూర్, మల్లంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
ఈ సారి అధికారంలోకి వస్తే రైతుబంధు సాయం ఎకరాకు రూ.16 వేలు ఇవ్వడంతోపాటు, రేషన్షాప్ల ద్వారా సన్న బియ్యం, రూ.400 లకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్ మహిళలకు నెలకు రూ.3 వేల జీవన భృతి అందించనున్నట్టు తెలిపారు. ప్రశాంతమైన మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు సోములు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు జగన్, పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, ఎంపీటీసీల ఫోరం మడల అధ్యక్షుడు కుబేర్ పాల్గొన్నారు.