
మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జిల్లా స్థాయి ఖోఖో క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ..క్రీడలు మానసికోల్లాసాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడలో ఆసక్తి చూపాలని తెలిపారు. చదువు విజ్ఞానాన్ని పెంచితే.. క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. ఓటమి గెలుపునకు పునాదని ఓడిపోయామని బాధపడకుండా ముందుకు వెళ్తే గెలుపు సొంతమవుతుందని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య, బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రావు, పీఈటీలు పాల్గొన్నారు.