ఖమ్మం, వెలుగు : గురువులను, తల్లిదండ్రులను విద్యార్థులు గౌరవించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు అన్నారు. గురువారం స్థానిక ఎస్బీఐటీ కాలేజీలో నిర్వహించిన మొదటి సంవత్సర విద్యార్థుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఫోన్లు, టీవీ లాంటి వ్యాపకాలు మానుకొని, వారంలో రెండు రోజులు డిజిటల్ ఉపవాసం అలవర్చుకోవడం ద్వారా విద్యపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు.
మోయలేని భారం వల్లనే ఒత్తిడి పెరుగుతుందన్నారు. గురువులతో చర్చించడంతో ఎలాంటి ఒత్తిడినైనా జయించవచ్చని సూచించారు. కాలేజీ చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఎస్బీఐటీలో ఉన్నతమైన విద్యా ప్రమాణాలు పాటించటంతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ అమిత్
పాల్గొన్నారు.