కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయ సారథి(86) మంగళవార అర్ధరాత్రి కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన ఇంట్లో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయసారథి పార్థివదేహానికి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్వినోద్ కుమార్, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, తదితరులు నివాళులర్పించారు.
మందాకిని కావ్య కవిగా ప్రసిద్ధి
భాష్యం విజయసారథి పాండిత్యం, గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. మందాకిని కావ్య కవిగా ప్రసిద్ధిగాంచిన భాష్యం విజయసారథి సంస్కృత భాషలో దిట్ట. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఏపీ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర రావు విజయసారథికి మహాకవి బిరుదు ఇచ్చి గౌరవించారు. భాష్యం మృతిపై సీఎంఓతో పాటు వివిధ పార్టీల నేతలు, అధికారులు, అభిమానులు సంతాపం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ భాష్యం విజయ సారథి ఇక లేరన్న వార్త తనకు బాధ కలిగించిందన్నారు. బాల్యం నుంచే పద్యరచన ప్రారంభించిన మహా మేధావి అని ప్రశంసించారు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, భాషాభివృద్ధి కోసం కృషి చేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.