మనుమరాళ్లకు సైతం మొక్కల పేర్లే.. ఇంట్రెస్టింగ్‎గా వనజీవి రామయ్య లైఫ్ స్టైల్

మనుమరాళ్లకు సైతం మొక్కల పేర్లే.. ఇంట్రెస్టింగ్‎గా వనజీవి రామయ్య లైఫ్ స్టైల్
  • పద్మశ్రీ ‘వనజీవి’ ఇకలేరు..
  • గుండెపోటుతో చికిత్సపొందుతూ మృతి
  • మొక్కలు నాటడంమే జీవిత ఆశయంగా బ్రతికిన రామయ్య
  • కోటిపైగా మొక్కలు నాటి ఎంతమంది ఆదర్శంగా..
  • రామయ్య సేవలకుగాను 2017లో  కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో  సత్కరించింది


ఖమ్మం రూరల్, వెలుగు: మొక్కలనే తన పిల్లలుగా కుటుంబ సభ్యులుగా ప్రేమించాడు.  ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం చేయకపోతే రోజు గడవదు. కోటి మొక్కలు నాటడమే తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. కోటికిపైగా మొక్కలునాటి తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య (85) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు.

 వనజీవి రామయ్య అందించిన సామాజిక సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2005లో సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో గౌవరవించింది. ‘యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌’  అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి ‘వనసేవా’ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య.

పద్మశ్రీ రామయ్య కుటుంబ నేపథ్యం..

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య జూలై 1వ తేదీ 1937లో లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు. అసలు పేరు దరిపల్లి రామయ్య కాగా మొక్కలు  నాటడమే జీవిత ఆశయంగా మలుచుకుని కోట్ల మొక్కలు నాటడంతో ఆయన ఇంటిపేరు ‘వనజీవి’గా మారిపోయింది. పుట్టి పెరిగింది ముత్తగూడెం గ్రామం కాగా తన భూములు రెడ్డిపల్లిలో ఉండగా అక్కడే స్థిరపడ్డారు. 

రామయ్య ముత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. రామయ్యకు 15వ ఏళ్లకే కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జానమ్మతో వివాహం జరిపించారు పెద్దలు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు ఒక్క కుమార్తె. కొద్దికాలం క్రితం రెండో కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే 45 ఏళ్లుగా మొక్కల పెంపకాన్నే తన జీవిత ఆశయం పెట్టుకుని తన జీవితాన్ని ప్రకృతి అంకితం చేశాడు రామయ్య.

ఖాళీ స్థలం కనిపిస్తే మొక్క నాటాల్సిందే..

అడవులు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు అలవాటు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ.. పాలు అమ్ముతూ మొక్కల పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని అవిశ్రాంతంగా కృషి చేశాడు. రామయ్య ఏదైనా శుభకర్యానికి వెళ్లినా మొక్కలనే బహుమతిగా ఇచ్చి పెంచాలని సూచించేవాడు. ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత:’’ అని రాసివున్న ప్లకార్డులను మెడకు తగిలించుకుని వెళ్లి ప్రచారం చేసేవాడు.

చివరి దశలో సైతం అలుపెరుగక..

పద్మశ్రీ రామయ్య చివరిదశలో సైతం అలుపెరుగకుండా మొక్కల కోసమే బతికాడు. నిత్యం అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించే వాడు. తొలకరి చినుకులు పడగానే అడవులకు వెళ్లి చల్లేవాడు. మొక్కలు పెంచి, పదిమందికి పంచడం తప్ప తనకు మరో వ్యాపకం లేదు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు జరిగే ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో గింజలు చల్లెవాడు. ఆయన యుక్త వయసులో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా పలు చోట్ల దర్శనమిస్తున్నాయి.

పనికిరాని వస్తువులే ప్రచార సాధనాలు..

పరిసరాలలో దొరికే అనేక పనికిరాని వస్తువులను తన ప్రచార సాధనాలుగా ఉపయోగించుకునేవాడు. మెకానిక్ షెడ్లకు వెళ్లి వారికి ఉపయోగపడని వస్తువులు తెచ్చుకుని వాటికి రంగులు వేసి ‘వృక్షో రక్షతి.. రక్షిత:” అని రాసి మెడకు తగిలించుకుని ప్రచారం చేసేవాడు. తలకి నిత్యం రింగులు ధరించుకుని ఎక్కడికి వెళ్లినా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించేవాడు. చిన్న చిన్న మట్టి కుండలు, ప్లాస్టిక్ డబ్బాలు, రింగులు ఇలా ఒక్కటేమిటి ఎటువంటి వస్తువునైనా మొక్కల పెంపకాన్ని ప్రొత్సహించే ప్రచార సాధనంగా మార్చుకునే వాడు. చివరకు కలియుగ వైకుంఠం తిరుమల కొండపై కూడా రామయ్య ప్రచార సాధనాలు చెట్లకు తగిలించాడు. 

మనుమరాళ్లకు సైతం మొక్కల పేర్లే..

పద్మశ్రీ రామయ్యకు మొక్కలపై ఉన్న మక్కువతో మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా చెట్ల పేర్లే పెట్టుకున్నాడు. నలుగురు మనుమరాళ్లు ఉండగా వారికి చందనపుష్ప, హరిత లావణ్య, కబంధపుష్ప, వనశ్రీ అనే పేర్లు పెట్టుకున్నాడు.  

రామయ్య జీవితం పాఠ్యాంశాల్లో సైతం..

వనజీవి దరిపల్లి రామయ్య చేసిన సామాజిక సేవను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించినట్లు  అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.  9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు.

రామయ్యను వరించిన అవార్డులు..

  • పద్మశ్రీ దరిపల్లి రామయ్య చేసిన సామాజిక సేవలకు గాను 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డను ప్రధానం చేసి సత్కరించింది. 
  • 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డును అందజేశారు. 
  • యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ ’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి గౌవరవించారు. 
  • 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు. 
  • 2000 సంవత్సరంలో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు వనజీవి రామయ్య సేవలను గుర్తించి ఒక మోపెడ్ ను కొనిచ్చారు. ప్రతి నెలా రూ.1500  గౌరవ భత్యాన్ని కేటాయించారు.