నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవాల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీత దాసరి కొండప్పను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జడ్పీ చైర్ పర్సన్ వనజ, అడిషనల్కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్, ఎస్పీ యోగేశ్ గౌతమ్, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి సన్మానించారు. జిల్లా వాసికి పద్మశ్రీ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. సన్మానం పొందిన దాసరి కొండప్ప తన బుర్రవీణ వాయిద్యంతో బలగం సినిమాలోని ‘అయ్యో శివుడా ఏమాయే’ అనే పాట పాడి ఆకట్టుకున్నారు.
కళాకారులను కేంద్రం ఆదుకుంటుంది
అంతరించి పోతున్న కళలకు జీవం పోసేందుకు కేంద్రం కళాకారులను ఆదరించి, అవార్డులు అందజేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దాసరి కొండప్ప స్వగ్రామమైన దామరగిద్దకు వెళ్లి సన్మానించారు. వెంట బీజేపీ నేతలు నాగురావు నామాజి, రతంగ్పాండురెడ్డి, సత్యయాదవ్ తదితరులు ఉన్నారు.