ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎస్డీఎఫ్ విడుదల ​ఆపండి : పద్మనాభరెడ్డి

  • ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎస్డీఎఫ్ విడుదల ​ఆపండి
  • సీఈసీకి ఎఫ్​జీజీ సెక్రటరీ పద్మనాభరెడ్డి లేఖ 

హైదరాబాద్, వెలుగు : ఎన్నికలు పూర్తయ్యేవరకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) విడుదలను ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఎలక్షన్​ కమిషన్​ను కోరారు. మంగళవారం ఈ అంశంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీఈవో వికాస్ రాజ్ కు లేఖ రాశారు. ఈ ఏడాది బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించారని, త్వరలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో అందులో రూ.5 వేల కోట్లు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్టేట్ ఎలక్షన్ సీఈవోకు ఆదేశాలు ఇవ్వాలని, సీఈవో కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి నిధుల విడుదల ఆపాలని లేఖలో పద్మనాభరెడ్డి కోరారు.

అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తే అభ్యంతరం లేదని, ఎన్నికల ముందు ఖర్చు చేయడం కరెక్ట్​కాదన్నారు. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ను గతంలో ఎప్పుడూ కేటాయించలేదని, ఏ పనులకు ఖర్చు చేస్తరు? ఏ శాఖ ద్వారా  ఖర్చు చేస్తరన్న వివరాలు స్పష్టం చేయలేదని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇన్ని వేల కోట్లు సీఎం దగ్గర ఉంచారన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేసి, కలెక్టర్ల ఆధీనంలో ఉంచుతారని పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ పనులను అధికార పార్టీ నేతలకు నామినేషన్ పద్ధతిన అప్పగిస్తారని, నాసిరకంగా పనులు చేస్తారని ఆయన ఆరోపించారు.