జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించండి

  • బీసీ డెడికేటెడ్ కమిషన్ కు పద్మశాలీల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకటి రాజ్ కుమార్ బీసీ డెడికేటెడ్ కమిషన్ ను కోరారు. ఈ మేరకు శనివారం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బూసాని వెంకటేశ్వరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పద్మశాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారానికి, ఆర్థిక స్వాతంత్య్రానికి దూరమయ్యారని తెలిపారు. అసెంబ్లీలో ఒకే ఒక్క పద్మశాలి ఎమ్మెల్యే  ఉన్నారని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.

చేనేత వృత్తిదారులను కళాకారులుగా గుర్తించాలని, 50 ఏండ్లు దాటిన వారిని కళాకారులుగా గుర్తించి పెన్షన్ ఇవ్వాలన్నారు. చేనేత సంస్థలన్నింటిని పద్మశాలి కార్పొరేషన్ కిందికి తీసుకురావాలన్నారు. టెక్స్ టైల్ పార్కుల్లో పద్మశాలీలకు నామమాత్రపు ధరకు స్థలం కేటాయించాలన్నారు. 

ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ లో వీటిని ప్రస్తావించి పద్మశాలీలకు న్యాయం చేయాలని చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ తో పాటు పద్మశాలి నేతలు గుంటి నగేశ్, గంజి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

రేపు మెదక్ లో పబ్లిక్ హియరింగ్

ఈ నెల 2న ఉమ్మడి మెదక్ జిల్లాలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో పర్యటించనున్నట్టు పేర్కొంది.