తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ( మే 14) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేసి... ఆలయ ప్రాంగణాన్ని శుద్ది చేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ( మే 14)న ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలంతో పుణ్యహవచనం కార్యక్రమం నిర్వహించి వేద మంత్రాలతో ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా మే 21 నుండి 24వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 23న తిరుప్పావడ సేవ, మే 24న లక్ష్మి పూజ ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.