- పద్మావతి నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడి
- సీఎం రేవంత్‌కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
ఖైరతాబాద్, వెలుగు: హైడ్రా రాకతో తమ ప్లాట్లు కబ్జా నుంచి బయటపడ్డాయని అమీన్పూర్ పంచాయతీ పరిధిలోని పద్మావతినగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు విజయ కుమార్‌రెడ్డి మాట్లాడారు. 1986లో 24 ఎకరాల్లో పంచాయతీ అనుమతితో వేసిన 193,194,323,324 సర్వే నంబర్లలోని ప్లాట్లను తాము కొనుగోలు చేశామని తెలిపారు.
దాని చుట్టుపక్కల ఏపీలోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఉమా మహేశ్వరమ్మ , సిస్టా రమేశ్‌కూడా ప్లాట్లు కొనుగోలు చేసి తమకు దారి లేకుండా చుట్టూ గోడ కట్టారని వివరించారు. ఈ నెల 8వ తేదీన హైడ్రా అధికారులు వాళ్లు నిర్మించిన గోడలను తొలగించడంతో ప్లాట్లలోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాతోనే ఇది సాధ్యమైందన్నారు. రేవంత్‌రెడ్డికి, హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్లాట్లు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని, వాటిని సర్వే చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. గాయిత్రి, తనూజ, సయ్యద్ హఫీజ్, వారీశ్ తదితరులు పాల్గొన్నారు.