- అందుకే వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదేమో: మంత్రి కోమటిరెడ్డి
- కులగణన సర్వేలో పాల్గొననివారికి దానిపై మాట్లాడే అర్హత లేదు
- తీన్మార్ మల్లన్న ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కుల గణనలో బీఆర్ఎస్నేతలు కేసీఆర్ , కేటీఆర్, హరీశ్ రావు వారి వివరాలు చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుందని, వాళ్ల ఆస్తులు నింపాలంటే పేజీల పేజీలు నిండుతాయని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే వారు సర్వేలో పాల్గొనలేదేమోనని చురకలంటించారు. మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్ లో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్ చేశారు.
కులగణన సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు దానిపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ తమ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతాయని చెప్పారు. కుల గణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచేలా ఒత్తిడి తెస్తామని అన్నారు.
ప్రైవసీ కారణంగా కుల గణన వివరాల్లో వ్యక్తిగత వివరాలను బయటపెట్టబోమని చెప్పారు. “లక్ష మంది ఎన్యూమరేటర్లతో కులగణన చేపట్టాం. ఇందుకు 55 రోజులు పట్టింది. వాళ్ల ప్రభుత్వం లాగా ఒక్క రోజే ఆగం ఆగం చేయలే. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క జడ్పీ చైర్మన్ కూడా రాదు. బీజేపీ, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏ మాత్రం పెరగలేదు” అని అన్నారు.
ఎమ్మెల్యేల మీటింగ్ పై సమాచారం లేదు
పది మంది ఎమ్మెల్యేలతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పెట్టిన మీటింగ్‌పై తనకు సమాచారం లేదని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘‘ఉత్తమ్, భట్టి దగ్గరకూ అనిరుధ్‌రెడ్డి వెళ్తారు. అనిరుధ్ ది సీఎం జిల్లా. ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేల మీటింగ్ లు కామన్. ఆ మీటింగ్ గురించి నాకైతే సమాచారం లేదు.
పనుల కోసం నా దగ్గరకు రోజూ 30 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. రోడ్ల కోసం ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లకు పైగా వర్క్ లు ఇచ్చిన. కొంత మంది ప్రపోజల్స్ లేట్ గా ఇచ్చారు. ఎమ్మెల్యేలు అందరికీ కలిపి రూ. 3 వేల కోట్ల వర్క్ లు ఇచ్చిన. బిల్స్ పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే” అని వెల్లడించారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ ను మార్చామని, ఏడాదిన్నరలో ఆ పనులు పూర్తవుతాయని తెలిపారు. ట్రిపుల్ఆర్ సౌత్ పార్ట్ నిర్మాణం కేంద్రమే చేయాలని, వచ్చే కేంద్ర కేబినెట్లో టేబుల్ చేయాలని నితిన్ గడ్కరీని కోరినట్టు చెప్పారు. వచ్చే ఐదేండ్లలో ట్రిపుల్ ఆర్ పనులు, విజయవాడ హైవే పనులు పూర్తి చేస్తామని, నల్గొండలో ఎస్ఎల్ బీసీ పనులు ఏప్రిల్ లో స్టార్ట్ అవుతాయని వెల్లడించారు.
బీసీల మీటింగ్ పెట్టి రెడ్లను ఎట్లా తిడ్తరు?
బీసీల మీటింగ్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. బీసీ ల సమస్యలపై పోరాడితే ఆయనకు అందరూ మద్దతు ఇస్తామని అన్నారు. కానీ బీసీల మీటింగ్ పెట్టి రెడ్ల ను ఎలా తిడ్తారని ప్రశ్నించారు. “ కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచి నా మీద ఎలా ఆరోపణలు చేస్తడు? ఆయన గెలుపు కోసం నేను పనిచేసిన. ఆయన నామినేషన్ కోసం భారీ ర్యాలీ తీసిన మీటింగ్ లు నిర్వహించిన. మంత్రిగా ఉండి నా పార్టీ ఎమ్మెల్సీ ఓటమికి నేనేందుకు పనిచేస్తా ” అని అన్నారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. ఈ విషయం పీసీసీ చీఫ్ ను అడగాలని చెప్పారు. తీర్మాన్మల్లన్న తనపై చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.