లష్కర్ ఈ తోయిబా షాడో గ్రూపే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ : ఆన్ లైన్ ద్వారా ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్స్

లష్కర్ ఈ తోయిబా షాడో గ్రూపే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ : ఆన్ లైన్ ద్వారా ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్స్

= 2019లో ఉనికిలోకి వచ్చిన టీఆర్ఎఫ్
= పాక్ నుంచి కశ్మీర్ కు మాదక ద్రవ్యాలు, ఆయుధాల రవాణాలోనూ ఈ  సంస్థది కీలక పాత్ర
= కాశ్మీర్ ప్రజలను భారత్ కు వ్యతిరేకంగా పనిచేసేలా సోషల్ మీడియాలో ప్రచారం

ఢిల్లీ: దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ అనే రహదారిపై సమీపంలో పర్యాటకులపై   నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.  ఈ దాడికి పాల్పడింది  ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) అని కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా షాడో గ్రూపే ది రిసెస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్​) అని తెలుస్తోంది. ఈ గ్రూపు 2019లో కార్యకలాపాలను ప్రారంభించింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా  కాశ్మీర్ యువతను ఆకర్షించడం, వారికి భారత్ పట్ల వ్యతిరేక భావన కలిగించి తమ ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకగా వ్యవహరిస్తోంది.

జనవరి 2023లో  చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద టిఆర్‌ఎఫ్‌ను "ఉగ్రవాద సంస్థ"గా కేంద్ర హోం శాఖ  ప్రకటించింది, ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాదుల చొరబాటు, పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రచారం కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్టుగా గుర్తించింది.  టిఆర్‌ఎఫ్ కాశ్మీర్‌లోని జర్నలిస్టులకు బెదిరింపులు జారీ చేసిన కొన్ని నెలల తర్వాత కేంద్ర హోంశాఖ ఈ సంస్థను నిషేధించింది.  

దాడి వెనుక సైఫుల్లా కసూరి! 

పహల్గాం దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్​ ప్రకటించినప్పటికీ దాని వెనుక ఉన్నది మాత్రం లష్కర్ ఈ తోయిబా అని తెలుస్తోంది. లష్కార్ ఈ తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడికి వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. భారత సైన్యం దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.  పాకిస్తానీ జాతీయుడైన సైఫుల్లా కసూరి లష్కర్ ఈ తోయిబాలో కీలక మైన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఈయన స్వస్థలం పాకిస్తాన్. ఖలీద్ అనే మారుపేరుతో పిలువబడే సైఫుల్లా ఈ దారుణానికి కుట్రపన్నినట్లు తెలుస్తోంది. సైఫుల్లా కసూరి ఎల్ ఇటీ గ్రూప్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సారధ్యంలో కమాండర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.