పహల్గాం దాడి..టూరిస్టులపై మాత్రమే కాదు..కాశ్మీరీల ఉపాధి,ఆర్థిక వ్యవస్థపై దాడి

పహల్గాం దాడి..టూరిస్టులపై మాత్రమే కాదు..కాశ్మీరీల ఉపాధి,ఆర్థిక వ్యవస్థపై దాడి

భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్‌లో వేలాది మంది స్థానికులకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు.పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి కేవలం టూరిస్టులపైజరిగిన దాడి మాత్రమే కాదు, దాదాపు 2.5 లక్షల మంది కాశ్మీరీల జీవనోపాధిపై, లోయ ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడి కూడా. ఉగ్రదాడి ఘటన టూరిస్టులలో నమ్మకాన్ని కోల్పోవడమేకాకుండా కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన టూరిజం ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. టూరిస్టులపై దూసుకెళ్లిన ప్రతి బుల్లెట్ కాశ్మీరీ ఆర్థిక వ్యవస్థను  కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. కాశ్మీర్ పై ఈదాడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటున్న విశ్లేషకులు. 

మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై  జరిగిన ఉగ్రదాడి ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది.ఇప్పటికే కాశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు టూరిస్టులు. ఇదే కాదు.. కాశ్మీర్ లోని హోటళ్లు,క్యాబ్ బుకింగ్ లు పెద్ద ఎత్తున రద్దు చేసుకుంటున్నారు. 

కాశ్మీర్ పర్యాటకం విలువ రూ.12వేల కోట్లు.. 

భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ లోని వేలాది మంది స్థానికులకు పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు. కాశ్మీర్ పర్యాటకానికి సంవత్సర ఆదాయం రూ.12వేల కోట్లు.2030నాటికి ఇది 25వేల కోట్లనుంచి 30వేల కోట్లకు చేరుతుందని అంచనా. కాశ్మీర్ పర్యాటక రంగం రాష్ట్ర మొత్తం జిడిపిలో 7-8 శాతం వాటా కలిగి ఉంది.మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఈ పరిశ్రమను పాతాళానికి తొక్కేసింది.  పహల్గామ్‌ను భారతదేశ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. 

ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. సెలవుల సీజన్ ఇప్పుడే ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి ఇప్పుడు ఈఏడాది మొత్తం సీజన్‌ను నాశనం చేసే అవకాశం ఉంది.దాల్ సరస్సులో 15వందల కంటే ఎక్కువ హౌస్ బోట్లు పనిచేస్తున్నాయి. కాశ్మీర్‌లో అనేక చిన్న ,పెద్ద హోటళ్లు ఉన్నాయి.వాటి మొత్తం సామర్థ్యం 3వేల కంటే ఎక్కువ గదులు ఉన్నాయి. 

ALSO READ : ఉగ్రదాడి మృతులకు బీసీసీఐ నివాళి.. SRH vs MI మ్యాచ్లో కీలక మార్పులు

2024లో కాశ్మీర్‌ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 2.36 కోట్లు..

కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2020లో 34 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి రాగా..2021లో కాశ్మీర్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య అనేక రెట్లు పెరిగి 1.13 కోట్లకు చేరుకుంది. 

ఈ సంఖ్య 2022లో 1.88 కోట్లకు పెరిగింది, 2023లో ఇది 2.11 కోట్లకు పెరిగింది. 2024లో ఇది 2.36 కోట్లకు చేరుకుంది. 2024లో 65వేలమందికి పైగా విదేశీ పర్యాటకులు లోయను సందర్శించారు. గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్ ,దాల్ సరస్సు కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఉన్నాయి. 2024లో గుల్మార్గ్ ఒక్కటే రూ.103 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.