
పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత టూరిస్టులు కాశ్మీర్ ను వదిలి వెళ్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలనుంచి వచ్చిన పర్యాటకుల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సెకండ్ క్లాస్ రిజర్వేషన్ లేని ప్రత్యేక రైలును జమ్మూ డివిజన్ లోని కాత్రా నుంచి న్యూఢిల్లీకి నడుపుతున్నారు.
గురువారం మధ్యాహ్నం 1.30గంటలకు ఈ రైలు కాత్రానుంచి బయలుదేరుతుంది.ఈ రైలు శ్రీ వైష్ణో దేవి కత్రా నుండి ప్రారంభమై ఉధంపూర్, జమ్మూ, పఠాన్‌కోట్, జలంధర్, అంబాలా, కురుక్షేత్ర పానిపట్ వద్ద ఆగుతుంది. దాని తుది గమ్యస్థానమైన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
పహల్గామ్ దాడి తరువాత భద్రతా కారణాల దృష్ట్యా అనేక మంది పర్యాటకులు తమ ప్రయాణాలను తగ్గించుకుని ఇంటికి తిరిగి రావాలని కోరిక వ్యక్తం చేయడంతో ఉత్తర రైల్వే కత్రా నుండి ఢిల్లీకి మొదటి ప్రత్యేక రైలును నడిపింది.
పర్యాటకులకు సహాయం హెల్ప్ డెస్క్‌లు,హెల్ప్‌లైన్ నంబర్లు
రైల్వేలు బాధిత పర్యాటకులకు సహాయం కోసం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేశాయి. రైలు షెడ్యూల్‌లు, ప్రయాణీకుల సేవలకు జమ్మూ తావి, కాట్రా స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
జమ్మూ తావి హెల్ప్‌లైన్ నంబర్ 0191-2470116. జమ్మూ ప్రాంతంలోని వారు రైలు సంబంధిత సమాచారం కోసం 1072 కు కూడా కాల్ చేయవచ్చు. కాట్రా ,ఉధంపూర్‌లకు హెల్ప్‌లైన్ నంబర్లు వరుసగా 01991-234876 , 7717306616.
Also Read:-కేంద్రం మరో సంచలన నిర్ణయం.. భారత్‌లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం
రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార ,ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ..కాత్రా,జమ్మూ రైల్వే స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జమ్మూలో సీసీటీవీ ఫీడ్‌తో కూడిన క్రౌడ్ మేనేజ్‌మెంట్ రూమ్‌తో పాటు ఇప్పటికే 235 మంది పర్యాటకులకు వివిధ రైళ్లలో వసతి కల్పించారు అని అన్నారు. రైల్వే శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనుకునే పర్యాటకులు సురక్షితంగా బయలుదేరేలా స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు.