
ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు పాకిస్తాన్‌కు చెందిన లష్కర్- ఏ-తొయిబా (ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థ అయిన "ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)" బాధ్యత వహించింది. ఈ దాడి వెనుక ఎల్‌ఈటీ సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరీ మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.
అలాగే దాడికి పాల్పడిన టీఆర్‌ఎఫ్ బృందానికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, చర్య తర్వాతే టీఆర్‌ఎఫ్ ఏర్పడింది. అప్పటి నుంచి అడపాదడపా జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడులు జరుగుతూనే ఉన్నాయి.
సైఫుల్లా కసూరీ ఎవరంటే..!
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్- ఏ-తొయిబా (ఎల్‌ఈటీ) సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీదే పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా తెలుస్తున్నది. కసూరిని ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడిగా కూడా చెబుతున్నారు. హఫీజ్ సయీద్.. జమాత్- ఉద్ -దవా (జేయూడీ) రాజకీయ సంస్థ మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) అధ్యక్షుడిగా సైఫుల్లా కసూరిని పరిచయం చేశాడు. ఈ జేయూడీనే 2016లో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్.. ఎల్‌ఈటీకి మారుపేరుగా,2008లో ఐక్యరాష్ట్ర సమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.