
న్యూఢిల్లీ: 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేశాయి. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ యుద్ధ నౌకను కూడా రంగంలోకి దింపింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ జల సరిహద్దుల్లోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక వెళ్లడంతో యుద్ధం తథ్యమనే ప్రచారం జరుగుతోంది.
భారత్ సింధు జలాలను నిలువరించడమంటే యుద్ధం ప్రకటించడమేనని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ‘Act of War’ అని చేసిన వ్యాఖ్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతుంది. పాక్ యుద్ధానికి కాలు దువ్వుతుందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. భారత్ కూడా పాకిస్తాన్కు ధీటుగా బదులివ్వాలనే ఉద్దేశంతోనే యుద్ధ నౌకను కూడా సముద్ర జలాల్లోకి పంపింది. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన నరమేధం తర్వాత.. భారత్, పాకిస్తాన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. భారత్, పాకిస్తాన్ కీలక నిర్ణయాలు ఇవే:
* పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్
* భారత్, పాక్ పరస్పర సరిహద్దుల మూసివేత
* భారత్ నుంచి ఎగుమతులు, పాక్ నుంచి దిగుమతులు బంద్
* భారత్, పాక్ గగనతలాల మూసివేత
* భారత్, పాక్ దేశాల మధ్య వీసాల రద్దు
* ఏప్రిల్ 29 లోపు ఏ దేశ పౌరులు ఆ దేశాలకు వెళ్లాలని ఆదేశాలు
* పాకిస్తాన్ లోని నూర్ ఖాన్ ఆర్మీ బేస్లో మోహరించిన పాక్ యుద్ధ విమానాలు
* పాక్ సరిహద్దులకు సైన్యాన్ని తరలించిన ఇండియా
* సైనికులకు సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్
* అరేబియా సముద్రంలో పాకిస్తాన్ జల సరిహద్దుల్లోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక
* బీఎస్ఎఫ్ జవానును నిర్భందించిన పాక్ రేంజర్లు
* పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఉండబోవని బీసీసీఐ ప్రకటన
* ఇస్లామాబాద్ వాఘా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
* భారత్ సింధు జలాలను నిలువరించడమంటే యుద్ధం ప్రకటించడమేనన్న పాక్