
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ఘాటుగా స్పందించిన వేళ.. పాకిస్తాన్ స్టాక్ మార్కట్లు అతలాకుతలం అయ్యాయి. పాక్ ఉగ్రవాదులు కశ్మీర్ లో పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపిన క్రమంలో.. పాక్ ను గట్టి దెబ్బ కొట్టేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. 26 మందిని చంపిన టెర్రర్ అటాక్ కు బదులుగా 5 సూత్రాల యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ చేంజ్ ((PSX)) గురువారం (ఏప్రిల్ 24) కుప్పకూలింది. ఉదయం KSE-100 ఇండెక్స్ 2485.85 పాయింట్లు డ్రాప్ అయ్యి 1, 14, 740 కి చేరుకుంది. అంటే ఒకానొక సమయంలో 2.12 శాతం మార్కెట్ పతనం కావడం పాక్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్.. రోజంతా నష్టాలను చవిచూసి చివరలో కాస్త రికవరీ అవ్వడానికి ప్రయత్నించింది. చివరలో 997 పాయింట్లు రికవరీతో ట్రేడర్ల కొంత నష్టాల నుంచి బయటపడ్డారు.
టెర్రర్ అటాక్ కు బదులుగా పాక్ కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1960 సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. బార్డర్ టెర్రరిజాన్ని అంతం చేసేందుకు పాక్ కఠిన చర్యలు తీసుకుని ఇండియాతో కలిసి వచ్చే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. దీని ప్రకారం సిందూ నదీ జలాలు పాక్ కు ఎక్కువమొత్తంలో చేరకుండా అడ్డుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అదే విధంగా అట్టారీ-వాఘా బార్డర్ ను కూడా మూసివేయాలని భారత్ నిర్ణయించింది. పాక్ లో ఉన్న ఇండియన్స్ మే 1, 2025 లోపు సరైన ధృవపత్రాలను చూపించి భారత్ లోకి రావచ్చునని, అదే సమయంలో భారత్ లో ఉన్న పాకిస్తానీలు, రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరూ భారత్ ను విడిచి వెళ్లాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సార్క్ వీసా ( SAARC Visa) మినహాయింపులో భాగంగా భారత్ లో ఉన్న పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం. అంతే కాకుండా దెబ్బకు దెబ్బ తీసుకుంటామని, పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో పాకిస్తాన్ లో భయాందోళనలు మొదలయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
ఇండియా మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్:
ఇండియన్ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రాఫిట్ బుకింగ్ కు గురయ్యాయి. ఏడు సెషన్లలో వరుసగా రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న మార్కెట్లలో.. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు ఫాల్ అయ్యింది. అదే సమయంలో నిఫ్టీ 72.3 పాయింట్లు డౌన్ అయ్యి 24,256.65 దగ్గర క్లోజ్ అయ్యింది. గత ఏడు సెషన్లలో సెన్సె్క్స్ 6,269 పాయింట్లు అంటే 8.48 శాతం లాభపడింది. నిఫ్టీ 1929.8 పాయింట్లు అంటే 8.61 శాతం పెరిగీ ఇన్వెస్టర్లకూ, ట్రేడర్లకు వరుస లాభాలు తెచ్చిపెట్టాయి.