
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రేపు ( ఏప్రిల్ 25) జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనను అర్థంతరంగా ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చారు. గురువారం అత్యవసరంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పహల్గాం ఉగ్రదాడిలో గాయపడి చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించేందుకు అనంత్ నాగ్ ఆస్పత్రికి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండింది. ఇది పిరికి పంద చర్య, ఉద్దేశ్యపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టేందుకు జరిగిన అమానుష ఘటన అని అభివర్ణించింది. ఇది దేశ గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి అని సీడబ్ల్యూసీ తెలిపింది. ఉగ్రదాడిలో చనిపోయిన కాశ్మీర్ స్థానికులు, టూరిస్టు గైడ్ లకు, టూరిస్టులకు సీడబ్ల్యూసీ నివాళులర్పించింది.
ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను చాటిచెప్పేందుకు ఎల్లుండి (ఏప్రిల్ 25) అన్ని రాష్ట్రాలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహిస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరగాల్సిన అన్ని సంవిధాన్ బచావో ర్యాలీలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు తిరిగి 27న ప్రారంభమవుతాయని వేణుగోపాల్ తెలిపారు.