పన్ను ఎగవేత నోటీసుపై క్లారిటీ ఇచ్చిన ఇన్ఫోసిస్

పన్ను ఎగవేత నోటీసుపై క్లారిటీ ఇచ్చిన ఇన్ఫోసిస్

భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ కు షాక్ తగింది. రూ. 32,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) నోటీస్ ఇచ్చింది. విదేశీ శాఖల ఆఫీసుల నుంచి సరఫరాల రసీదుకు బదులుగా కంపెనీ విదేశీ బ్రాంచ్ ఖర్చుల రసీదులను తీసుకుందని తెలిపింది. బెంగుళూరు ఇన్ఫోసిస్ శాఖ అందుకున్న సరఫరాలపై రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఐజీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని పేర్కొంది. భారతదేశం వెలుపల ఉన్న శాఖల నుంచి జూలై 2017 నుంచి 20-22 వరకు రూ. 32,403.46 కోట్ల లావాదేవీలపై వివరణ ఇవ్వాలని తెలిపింది.

కాగా వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)లో రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) అనేది వస్తువులు లేదా సేవల గ్రహీత.. సరఫరాదారుకు బదులుగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇన్ఫోసిస్ వారి భారతదేశం నుంచి ఎగుమతి ఇన్‌వాయిస్‌లో భాగంగా విదేశీ బ్రాంచ్‌ల కోసం వెచ్చించిన ఖర్చులను చేర్చింది. కంపెనీ పేర్కొన్న ఎగుమతి విలువల ఆధారంగా అర్హత కలిగిన వాపసును లెక్కిస్తున్నట్లు డిజిజిఐ నోటీసులో పేర్కొంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎగుమతి ఆదాయం, ఎగుమతి ఇన్‌వాయిస్‌ను కంపెనీ పెంచుతోందని వివరించింది.

కాగా ఈ నోటీసుపై ఇన్ఫోసిస్ కూడా స్పందించింది. అన్ని బకాయిలు చెల్లించామని, DGGI క్లెయిమ్ చేసిన ఖర్చులపై GST వర్తించదని పేర్కొంది. ఇన్ఫోసిస్ తన జీఎస్టీ బకాయిలన్నీ చెల్లించిందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. కంపెనీ విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, సేవల దిగుమతిపై ఆర్సీఎం కింద ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చెల్లించలేదని సూచిస్తూ బెంగళూరు డీజీజీఐ అధికారులు సేకరించిన పత్రంలో ఉన్నట్లు పేర్కొంది.