ఆర్మూర్, వెలుగు : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ఆర్టీసీకి బకాయిపడ్డ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని, లేదంటే షాపింగ్ మాల్ ఖాళీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా సోమవారం ఆర్మూర్ కు వచ్చిన పైడికి ఘన స్వాగతం లభించింది. పెర్కిట్, మామిడిపల్లి, ఆర్మూర్ చౌరస్తా, కింది బజార్, పెద్దబజార్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పార్టీ శ్రేణులు భారీ గజమాలతో ఆయన్ను సన్మానించారు.
ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. సిట్టింగ్ఎమ్మెల్యేను మూడో స్థానానికి పరిమితం చేశారంటే ఆయనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో గమనించాలన్నారు. ప్రజాస్వామ్యంలో గుండా రాజకీయాలకు, బెదిరింపులకు తావు లేదన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సుపరిపాలన అందిస్తానన్నారు. ఆర్మూర్ లో గంజాయి లేకుండా చూడాలని, అక్రమ కేసులు పెట్టొద్దని పోలీసులకు సూచించారు.
నియోజకవర్గంలోని ప్రతీ పల్లెలో ఉన్న ప్రతిఒక్కరూ తనవారేనని, పార్టీలకతీతంగా ప్రజలందరికీ సేవా చేస్తానన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, పోల్కం వేణు, ఆకుల రాజు, కలిగోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.