పైసల రాజకీయాలు అంతం కావాలి : కోదండ రామ్

సరళీకరణ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఈ మార్పుల ఫలితంగా రాజకీయాలు వ్యాపారీకరణ చెందినాయి. అమ్మడం, కొనడం, సంపాదించుకోవడమే రాజకీయాల ప్రథమ కర్తవ్యమైంది. రాజకీయ నాయకులు అధికారాన్ని వ్యాపారానికి పెట్టుబడిగా చూస్తున్నారు. తెలంగాణా ఉద్యమం ఈ అవినీతికి, వ్యాపారీకరణ చెందినరాజకీయాలకు దూరంగానే నిలిచింది. తెలంగాణా సాధించాలన్న ఏకైక లక్ష్యం కోసం ప్రజలు జె. ఏ. సీలుగా ఏర్పడి, పవిత్రంగా పోరాటం చేసినారు. ఎవ్వరూ ప్రలోభాలకు గురికాలేదు. తమతో లేని, తెలంగాణ పోరాటంలో పాలుపంచుకోని రాజకీయ నాయకులను ఎక్కడా దీక్షాశిబిరాల దరికి రానివ్వ లేదు. అట్లాంటి నాయకులను సమాజంలో తిరగనివ్వలేదు. యువతీ, యువకులు రాష్ట్రం కోసం తమ ప్రాణాలనే బలిదానం చేసి ప్రపంచానికి తెలంగాణా ఆకాంక్షను తెలియచెప్పినారు. పైసలు ఇస్తే కానీ మీటింగులకు రాని ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చినారు. నాతో సిరిసిల్ల రైతులు నువ్వు పిలువనంపితే హైదరాబాదుకు వస్తామని అన్నారు. ట్యాంకు బండ్​కు ఇంటికొకరు రావాలంటే ఎర్రగడ్డ నుండి ఒక మహిళ ఇంటిల్లి పాది పనులకు పోతే తాను మనువడి సాయంతో ట్యాంకు బండ్​ వద్దకు చేరుకున్నది. ఇట్లాంటి ఘటనలు కోకొల్లలు. ప్రజలు సంఘటితంగానిలబడి, సమరశీలతతో పోరాటం చేయకపోతే తెలంగాణా వచ్చేది కాదు. ఈ పోరాటాల వల్లనే సమైక్య వాదం కుప్పకూలి, తెలంగాణా వాదం బలపడింది. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా ఉద్యమాన్ని పరిశీలిస్తే ప్రజలు నిస్వార్థంగా, క్రియాశీలకంగాఉద్యమంలో పాల్గొన్నారనేది మనకు ప్రస్పుటంగా కనబడే అంశం, రాష్ట్ర సాధన తప్ప వారికి ఇంకొక ఆలోచన లేదు. ఎటువంటి ప్రలోభాలకుగురి కాలేదు. 

ఆర్థిక, రాజకీయ రంగాలు ఒక్కటైన సందర్భం

అధికారం, ఆర్థిక కార్యకలాపాలు పెనవేసుకొని పోయాయి. వ్యక్తిగత సామర్థ్యం కన్నా రాజకీయ నాయకులతో ఉన్న సంబంధం వ్యాపారంలో ఎదగడానికి ప్రధాన సాధనమైంది. డిల్లీ మద్యం కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న నాయకుల ఆర్థిక ఎదుగుదల ఇందుకు సాక్ష్యం. ఈ మధ్యన నిజాయితీగా సివిల్ కాంట్రాక్టులు చేసే కాంట్రాక్టర్లు కొందరు నన్ను కలిసి ఇక వ్యాపారం చేయలేము. వదిలేస్తున్నాం అని చెప్పినారు. ఆఖరుకు బిల్లులు విడుదల కావాలన్నా  ప్రగతి భవన్​తో సంబంధం కలిగిన  బ్రోకర్లతో పరిచయాలు అవసరమని అన్నారు. మరొక సీనియర్ కాంట్రాక్టరు కలిసినప్పుడు మేము నాయకులకు వెట్టిచేస్తున్నామని ఆవేదనతో చెప్పాడు. అధికార పార్టీ దిగువ నాయకులకు లంచాలు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవదని చెప్పే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బోలెడు మంది ఉన్నారు. ప్లాట్ల యజమానులను బెదిరించి ఆ ప్లాట్లను తమ పేరు మీదికి మార్చుకున్న అధికార పార్టీ నాయకులున్నారు.

తెలంగాణా మోడల్

ఈ పరిస్థితిలో ప్రజల సంక్షేమం కన్నా నాయకుల ఆర్థిక ఎదుగుదల కోసమే అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ పరిణామాల పర్యవసానంగా కొత్త అభివృద్ది వ్యూహాలు ముందుకు వచ్చినాయి. ఒక వైపు ప్రజలకు సంక్షేమం పేరుతో చిల్లర కాసులు వెదజల్లుతూ, కాంట్రాక్టర్ల కోసం అభివృద్ది పేరుతో బడ్జెట్ నిధులను విడుదల చేస్తున్నారు. ఇందుకు కాళేశ్వరం ఒక ఉదాహరణ. నీళ్ళు ఇవ్వక పోగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్టు గుదిబండగా మారింది. సంవత్సరానికి అప్పుల చెల్లింపులు, నిర్వహణకు కలిపి సుమారు 25,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయవలసి వస్తున్నది. అయితే భారీ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు కాసులు కురిపించింది. వారిని ప్రపంచ కుబేరుల సరసన నిలబెట్టింది. ఈ విధంగా నిధుల దుర్వినియోగం జరగడంతో ఖజానా ఖాళీ అయింది. వృథా ఖర్చులతో చివరికి రాష్ట్రం అప్పుల పాలైంది. అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని తీవ్ర ఆర్థిక దుస్థితిలో రాష్ట్రం ఉన్నది. అందుకే ఉద్యోగాల కల్పన బాధ్యతను ప్రభుత్వం వదులుకున్నది. అప్పుడు తెలంగాణ కోసం, ఇప్పుడు ఉద్యోగాల కోసం పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ‘నిరుద్యోగమే నా చావుకు కారణమని’ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. చిన్న, కుటీర పరిశ్రమల కోసం ప్రభుత్వం చేసిందిశూన్యం. వాస్తవ సాగుదారులైన, కౌలు రైతులు, పోడు రైతులు, సాదా బైనామా ద్వారా భూమి కొన్న వారికి, ప్రభుత్వ భూములు దున్నుకుంటున్న పేద రైతులకు ప్రభుత్వం నుండి వీసమెత్తు సహాయం అందడం లేదు. సహజంగానే ఈ అభివృద్ది నమూనాను ప్రశ్నించడం, నిరసన తెలపడం ప్రభుత్వానికి సుతారమూ ఇష్టం లేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వం ధర్నా చౌకును మూసి వేసింది. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం అడుగంటింది. అన్నీ వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. సమాజానికి మార్గ దర్శకత్వం వహించగల యూనివర్సిటీలు కుప్పకూలిపోయాయి. యూనివర్సిటీలకు నాయకత్వం లేకపోతే పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానే వైస్-ఛాన్సలర్ల పోస్టులను నెలల  తరబడి ఖాళీగా ఉంచి ప్రభుత్వం యూనివర్సిటీ వ్యవస్థను బలహీనం చేసింది. 

ప్రత్యామ్నాయం

ప్రతిపక్షాలు కూడా పైసల రాజకీయాలకు అతీతం కాదు. పైసల రాజకీయాలను తిరస్కరించి ప్రజలను సమస్యల ప్రాతిపదికన సమీకరించి, కదిలించగలిగితేనే రాజకీయాలను ప్రజాస్వామికీకరించగలం. అంటే రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచి, ప్రజలను రాజకీయ శక్తిగా మలుచు కోగలిగితేనే ప్రజలు కేంద్రంగా రాజకీయాలు అంకురిస్తాయి. నిరంకుశ రాజకీయాలను ఓడించడానికి ఇంతకుమించి ఇంకొక మార్గం లేదు. బలమైన ఆర్థిక ప్రయోజనాల సాధనకు రాజకీయ అధికారం కీలకం అని తెలిసిన రాజకీయ శక్తులు అంత తొందరగా అధికారాన్ని వదులుకోవు. ఇదితెలంగాణా ఉద్యమం నేర్పిన గుణపాఠం. ఇప్పటికైనా ప్రజాస్వామిక రాజకీయాల నిర్మాణానికి పూనుకుందాం.

నిరంకుశ పాలనలో ఎన్నికలు

నిరంకుశ పాలనలో ఎన్నికలు కూడా ప్రజాస్వామికంగా సాగవు. డబ్బులు కుమ్మరించి, మీడియాను కట్టడి చేసి ఓట్లను కొనుగోలు చేయడమే మనకు కనబడుతున్నది. ఇప్పటికే రష్యా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు అర్థం లేకుండా పోయింది. ఈ మార్పుకు పరాకాష్ట మునుగోడు ఎన్నిక. అయినా ప్రజలను రాజకీయంగా చైతన్యపరచ గలిగినప్పుడే ఈ ఓట్ల వ్యాపారాన్ని ఎదుర్కొనగలం. ఓట్ల బేరం చేయగల శక్తి ఉన్న పార్టీలు వస్తే మార్పు సాధ్యం అని నమ్మే వాళ్ళున్నారు. కానీ అందువల్ల వ్యక్తులు మారుతారు తప్ప, రాజకీయాలు మారవు. మారవలసింది పార్టీలు, వ్యక్తులు మాత్రమే కాదు, రాజకీయాలే మారాలనే విషయాన్ని మరచిపోవద్దు. ఆ మార్పు లక్ష్యంగా పనిచేయాలి. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? తెలంగాణ రాకపోతే, పరిస్థితి ఇంత అధ్వాన్నంగా దిగజారక పోవునని అనుకునే వాళ్ళున్నారు. ఇది పసలేనివాదన. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ఉద్యమ రాజకీయాలు కొనసాగి ఉంటే, టీఆర్‌‌ఎస్‌‌ నిరంకుశ రాజకీయాలకు అవకాశం వచ్చేది కాదు. జయశంకర్‌‌గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ది కోసం మరో పోరాటం సాగి ఉంటే రాజకీయాలు ఇట్లా దిగజారవు.

ఉద్యమ స్ఫూర్తి అడుగంటి..

రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలకుల్లో  ఆ ఉద్యమ స్ఫూర్తి అడుగంటి పోయింది. టీఆర్ ఎస్ అధినాయకుడు, కెసిఆర్ స్పష్టంగా తమది ఉద్యమ పార్టీ కాదని, తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించాడు. ఇక ఉద్యమంతో తెగతెంపులు చేసుకున్నాక టీ ఆర్ఎస్ అప్పటికి తాము నేర్చుకున్న, ఔపాసన పట్టిన వ్యాపారీకరణ చెందిన రాజకీయాలనే ఆచరణ లోకి తెచ్చినాడు. అధికారాన్ని సంపాదనకు తోడ్పడగల సాధనంగా చూడటం మొదలుపెట్టిండు. అందుకే కెసిఆర్ ప్రజలకు దూరమై, ప్రజల భాగస్వామ్యాన్ని కుదించి తనపద్దతిలో తాను రాజకీయాలు చేయడం మొదలు పెట్టిండు. తన ఇష్టానుసారం అధికారాన్ని చెలాయించడం మొదలు పెట్టిండు. సమాజ సంక్షేమం అనే లక్ష్యాన్ని పూర్తిగా వదులుకున్నాడు. కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు మేలు చేయడం కోసమే ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిండు. పార్టీ మొత్తం అదేమార్గంలో నడిచింది. భూమి సెటిల్మెంట్లు, ఇసుక దందాలు, కాంట్రాక్టులు పొందడం పరమావధిగా మారిపోయింది.

- ఎం. కోదండ రామ్, అధ్యక్షులు, తెలంగాణ జన సమితి