ఇస్లామాబాద్: కమిటీ ఆఫ్ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) ప్రకటించిన గ్లోబల్ ఇంప్యూనిటీ ఇండెక్స్‌లో పాకిస్థాన్ తొమ్మిదో ప్లేస్‌లో నిలిచింది. పాక్‌తోపాటు చాలా దేశాల్లో జర్నలిస్టులను చంపిన నేరస్థులు ఎలాంటి శిక్ష అనుభవించకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. జర్నలిస్టుల హత్యల కేసుల్లో అపరిష్కృతం కాకుండా ఉన్న కేసులను బట్టి ఏయే దేశాలు ఎన్నో స్థానంలో ఉన్నాయనే వివరాలను సీపీజే వెల్లడించింది. ఈ జాబితాలో సోమాలియా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అక్కడ జర్నలిస్టుల హత్యా ఘటనలకు సంబంధించి ఎన్నో కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయి.
సీపీజే ప్రకటించిన ఇంప్యూనిటీ ఇండెక్స్‌లో సోమాలియా తర్వాతి స్థానాల్లో సిరియా, ఇరాక్, సౌత్ సూడాన్‌లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌లో కూడా జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. అందుకే ఈ లిస్టులో ఆ దేశం ఐదో స్థానంలో నిలిచింది. కాగా, ఈ పదేళ్ల కాలంలో సిరియా అంతర్యుద్ధం, అరబ్ ప్రభుత్వాలపై వెల్లువెత్తిన నిరసనల కవరేజీల్లో అతివాద గ్రూపులు, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లు చేసిన దాడుల్లో ప్రపంచ వ్యాప్తంగా 278 మీడియా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని సీపీజే ప్రకటించింది. వీటిలో 81 శాతం కేసుల్లో దోషులకు శిక్ష పడలేదని తెలిపింది.