ఆసియా కప్ 2023 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లు..మైండ్‌గేమ్ ఆడటం మొదలెట్టేశారు. పాకిస్తాన్ జట్టును చూసి మిగిలిన జట్లన్నీ భయపడుతున్నాయని ఆ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇమామ్.. పాకిస్థాన్ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని చెప్పుకొచ్చాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల బ్యాటింగ్ లైనప్.. గంటకు 150 కి.మీ వేగంతో బంతులేసే పటిష్టమైన బౌలింగ్ లైనప్ పాక్ సొంతమని తెలిపాడు. దీంతో తమ జట్టును చూసి ప్రత్యర్థి ఆటగాళ్లందరూ భయపడుతున్నారని వాపోయాడు.
"బయటకి ఒప్పుకోకపోయినా.. పాకిస్తాన్ వన్డే జట్టును చూసి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే పాక్ సాధించిన విజయాలు అలా ఉన్నాయి. మా జట్టులో వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది. నేను ఇప్పటివరకూ 60 వన్డేలు ఆడాను. ఫకార్(ఫఖర్ జమాన్) 70 , బాబర్ ఆజమ్ 100 మ్యాచుల వరకూ ఆడాడు".
"ఇంకా నసీం, షాహీన్, హారీస్, వసీం జూనియర్, షాదబ్, నవాజ్, ఒసామా మీర్, ఇఫ్తికర్ అమ్మద్, సల్మాన్ ఆలీ అఘా, రిజ్వాన్.. ఇలా మా జట్టు నిండా అనుభవం ఉన్న ఆటగాళ్లే. అందరూ మ్యాచ్ విన్నర్లే. నేను టీమ్‌లో ఉన్నానని మా జట్టు బలంగా ఉందని చెప్పడం లేదు. నేను టీమ్‌లో లేకపోయినా ఇదే మాట చెప్పవాడిని.. స్ట్రాంగ్ అని ఒప్పుకునేవాడిని. జట్టులో ప్రతీ ఒక్కరికి వారి పాత్రేంటో అవగాహన ఉంది. ఈజీగా వరల్డ్ కప్ గెలవగలమన్నా నమ్మకమూ ఉంది.." అని ఇమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్.. చచ్చి చెడీ గెలిచింది. మొదట అఫ్గాన్ 300 పరుగులు చేయగా.. మరో బంతి ఉండగా చివరి వికెట్‌కు లక్ష్యాన్ని చేధించింది.
ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, ఆఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీష్ అష్రఫ్, రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది.