సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న ఆఖరి టెస్ట్ అనంతరం ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అందుకు ముందు వార్నర్ కు చేదు ఘటన ఎదురైంది. ఆఖరి టెస్ట్ కోసం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో ఎవరో అతని బ్యాగీ గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో ధరించే క్యాప్) దొంగలించారు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్.. దాన్ని కనుగొనడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆస్ట్రేలియా ప్రభుత్వం డిటెక్టివ్‌లను రంగంలోకి దించి.. దేశం మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలని మసూద్ కోరారు.
"వార్నర్ గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాడు తన క్రికెట్ కెరీర్ ఆఖర్లో వార్నర్ సరైన గౌరవం పొందాలి. అతని బ్యాగీ గ్రీన్ క్యాప్ కోసం 'ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశమంతటా గాలింపు చర్యలు చేపట్టాలి. అత్యుత్తమ డిటిక్టెవ్ అధికారులను రంగంలోకి దించాలి. ఏ క్రికెటర్‌కైనా ఇది అత్యంత విలువైన సమయం. అతని క్యాప్ తిరిగి దొరుకుతుందని నేను ఆశిస్తున్నా.." అని మసూద్ చెప్పుకొచ్చారు.
ఏంటి ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్..
ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసే సమయంలో ఆటగాళ్లకు ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్ అందిస్తారు. అది వారికి గౌరవ సూచికం. కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న వార్నర్ దాన్ని ధరించాలనుకున్నాడు. కానీ, ఆది కనిపించకపోవడంతో తట్టుకోలేకపోతున్నాడు. సిడ్నీ వేదికగా రేపటి(జనవరి 3) నుంచి చివరి టెస్ట్ ప్రారంభంకానుంది.
కాగా, తొలి రెండు టెస్టుల్లో ఓడిన పాక్.. చివరి టెస్టులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. పాకిస్తాన్ జట్టు.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచి 26 ఏళ్లు అవుతోంది. చివరిసారిగా వారు 1995-లో కంగారూల గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచారు.