భారత క్రికెటర్లు కాగితం మీద పులులు..: విషం చిమ్మిన పాకిస్తాన్ క్రికెటర్

భారత క్రికెటర్లు కాగితం మీద పులులు..: విషం చిమ్మిన పాకిస్తాన్ క్రికెటర్

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓటమిపాలైన భారత జట్టు.. 12 ఏళ్ల తరువాత సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ చేజార్చుకుంది. ఈ ప్రదర్శన పట్ల పాక్ క్రికెటర్,  ఓపెనింగ్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ తన యూట్యూబ్ చానల్ వేదికగా భారత ఆటగాళ్లపై విషం వెళ్లగక్కాడు.

భారత క్రికెట్ టీం ఆటతీరు చూస్తుంటే.. చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో ఆడిన ఆట గుర్తుకు వస్తుందని షెహజాద్ ఎద్దేవా చేశాడు. అంతటితో ఆగకుండా భారత క్రికెటర్లు కాగితపు పులులు అని, సొంతగడ్డపైనే ఓడేంత అల్పులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ క్రికెట్ టీం భారత్‌ను చిన్న పిల్లల్ని ఓడించినంత ఈజీగా.. అలవోకగా ఓడించిందని విమర్శలు చేశాడు. 

వరుసగా పద్దెనిమిది సిరీస్ విజయాలు

ఈ సిరీస్ ఓటమికి ముందు భారత్ 2012 నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచింది. ఈ విషయాన్ని మరిచిన షెహజాద్ కేవలం ఒక్క టెస్టు సిరీస్ ఓడిపోగానే భారత క్రికెట్ టీంపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. 

తొలి టెస్టులో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయ్యాక.. కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన ప్రతి ఒక్కరికీ బ్యాడ్ డే ఉంటుందన్న విషయాన్ని షెహజాద్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. రెండో టెస్టులో 146 పరుగులకు ఆలౌట్ అయ్యాక.. భారత క్రికెటర్ల ఆట తీరు చూసి రోహిత్ శర్మ చెప్పిన మాటలు అనవసరంగా నమ్మానని అనిపించిందన్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచుల్లో ఇండియన్ క్రికెటర్ల ఆట తనకు స్కూల్ డేస్ గుర్తు చేసిందని విమర్శించాడు. పాక్ క్రికెటర్ వ్యాఖ్యల పట్ల భారత అభిమానులు మండిపడుతున్నారు.

టెస్ట్ ఛాంపియన్‌షిప్..

పాక్ క్రికెటర్ వ్యాఖ్యలు పక్కనపెడితే, టీమిండియా కష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఈ రెండు  టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్ల పట్టికపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి. ప్రస్తుత సైకిల్‌లో భారత జట్టు ఇంకో ఐదు అయిదు టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా ఆఖరి టెస్ట్ ఆడనుండగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఐదు టెస్టుల్లో తలపడాల్సి ఉంది. ఈ ఆరింటిలో కనీసం నాలుగింట గెలిస్తే, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశం ఉంది. లేకపోతే ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సిందే.