స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం: మోడీకి మొరపెట్టుకున్న పాకిస్తాన్ క్రికెటర్

మ్యాచ్ ఫిక్సింగ్ - పాకిస్తాన్ క్రికెటర్లు.. ఈ రెండింటిది విడదీయరాని బంధం. డబ్బుపై వ్యామోహంతో పాక్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటం.. దేశాల క్రికెట్ బోర్డులు వారిపై నిషేధం విధించడం. ఇదొక ఆనవాయితీ. ఇలానే ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఓ పాక్  క్రికెటర్‍పై ఇంగ్లాడ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) జీవిత కాలం నిషేధం విధించగా.. దాన్ని తొలగించేలా చొరవ తీసుకోవాలని అతడు భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రాధేయపడ్డాడు.

జీవిత కాల నిషేధం

2009లో కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో డేనిష్ కనేరియా, మాజీ ఎసెక్స్ పేస్ బౌలర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి కుట్రపన్నినట్లు ఈసీబీ విచారణలో బయటపడింది. ఆ మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి ఉద్దేశపూర్వకంగా నో బాల్స్ వేశారు. అనంతరం ఈ నేరాన్ని వెస్ట్‌ఫీల్డ్‌ అంగీకరించడంతో ఈసీబీ.. అతనిపై ఐదేళ్ల నిషేధం విధించగా, కనేరియాపై జీవిత కాలం నిషేధం విధించింది. అయితే దాన్ని తొలగించేలా చొరవ తీసుకోవాలని అతడు భారత ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించుకున్నాడు.  

ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడిన కనేరియా.."ఈసీబీ నాపై విధించిన నిషేధాన్ని తొలగించడంలో నాకు సహాయం చేయవలసిందిగా భారత ప్రధాని మోడీకి, బీసీసీఐకి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.." అని వెల్లడించాడు. అయితే దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో తెలియాలి.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆడిన రెండో హిందువు డేనిష్ కనేరియా.

ALSO READ :- బీజేపీతోనే బీసీ ముఖ్యమంత్రి సాధ్యం : లక్ష్మణ్