తోటి ఆటగాడైతే ఏంటి..? గ్రౌండ్‌లోనే గొడవకు దిగిన పాక్ క్రికెటర్లు

తోటి ఆటగాడైతే ఏంటి..? గ్రౌండ్‌లోనే గొడవకు దిగిన పాక్ క్రికెటర్లు

క్రికెట్ ఆడుతూ అభిమానులను ఎంటర్టైన్ చేయడం ఎప్పుడూ జరిగేదే. కొన్ని సందర్భాల్లో ఇది బోర్ కొట్టొచ్చు. అందుకే అప్పుడప్పుడు ఆటగాళ్లు గొడవలు దిగుతుంటారు. ఫ్యాన్స్ ఖుష్ అవుతుంటారు. అలాంటి సన్నివేశమే ఇది. అంతర్జాతీయ క్రికెటర్లు అయ్యుండి విచక్షణ మరిచి ఇద్దరు పాక్ క్రికెటర్లు మైదానంలోనే దూషణకు దిగారు. నువ్వెంత..? అంటే నువ్వెంత..? అంటూ మాటల యుద్ధానికి దిగారు.

పాక్ వేదికగా జరుగుతున్న సింధ్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం లార్కణ ఛాలెంజర్స్, కరాచీ ఘాజీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కరాచీ కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్.. ఛాలెంజర్స్ సారథి అసద్ షఫిక్‌పై దూషణకు దిగాడు. ఇఫ్తికార్ బౌలింగ్‌లో షఫిక్ వరుసగా ఓ సిక్స్, ఫోర్ బాదాడు. ఆపై మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన కరాచీ కెప్టెన్ కోపంతో షఫిక్‌పై నోరుపారేసుకున్నాడు. అతడిని ఔట్ చేసిన ఆనందంలో తిడుతూ.. మీదకు దూసుకెళ్లాడు.

అందుకు షఫిక్ సైతం ధీటుగా బదులిచ్చాడు. నోరు అదుపులో పెట్టుకో అంటూ ముందుకు దూసుకెళ్లాడు. వెంటనే సహచర ఆటగాళ్లు, అంపైర్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం ఇఫ్తికార్ అహ్మద్.. అసద్ షఫిక్‌కు క్షమాపణలు చెప్పాడు.

ఈ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కరాచీ ఘాజీ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేయగా.. ఛేదనలో ఛాలెంజర్స్ 92 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో ఇఫ్తికర్ అహ్మద్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. 69 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో 3 కీలక వికెట్లు పడగొట్టాడు.