Mohammad Haris: అనుమతించేది లేదు.. యువ బ్యాటర్‌కు షాకిచ్చిన పాక్ క్రికెట్ బోర్డు

Mohammad Haris: అనుమతించేది లేదు.. యువ బ్యాటర్‌కు షాకిచ్చిన పాక్ క్రికెట్ బోర్డు

బంగ్లా ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడేందుకుగానూ ఆ దేశ గడ్డపై అడుగుపెట్టిన పాక్ యువ వికెట్ కీపర్‌ మహ్మద్‌ హరీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడు ఢాకా(బంగ్లాదేశ్ రాజధాని) చేరుకొని సాధన మొదలుపెట్టిన గంటల వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి పిలుపొచ్చింది. బీపీఎల్‌లో ఆడేందుకు అవసరమైన నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇవ్వట్లేమననేది దాని సారాంశం. ఈ విషయం తెలిసిన వెంటనే హరీస్‌.. ఉన్నఫళంగా మళ్లీ పాకిస్తాన్‌ వెళ్లే ఫ్లైట్‌ ఎక్కి స్వదేశానికి  పయనమయ్యాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. 

'బ్యాక్‌ టు హోమ్‌.." అంటూ హరీస్‌ తన లగేజీ బ్యాగులను తీసుకెళ్తున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. పాక్ క్రికెట్ బోర్డు  నిబంధనల ప్రకారం ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు మాత్రమే అర్హులు. ఈ లెక్కన హ్యారీస్‌ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్‌(లంక ప్రీమియర్ లీగ్ మరియు గ్లోబల్ T20 కెనడా)ల్లో ఆడాడు. ఈ క్రమంలోనే పీసీబీ అతనికి మూడో లీగ్‌లో ఆడేందుకు ఎన్‌ఓసి జారీ చేయలేదు. అయితే, ఈ రూల్స్ తనకు తెలియవని హ్యారిస్ చెప్పుకొచ్చాడు. ముందుగా సన్నద్ధం కావడం కోసమే బంగ్లాదేశ్ వచ్చానని, ఎన్‌ఓసి జారీ చేయబడదని తెలిసిన తరువాత స్వదేశానికి వెళ్లిపోతున్నాని తెలిపాడు.

పాకిస్తాన్ జట్టు తరుపున గతేడాది అరంగ్రేటం చేసిన ఈ బ్యాటర్ ఇప్పటివరకూ 6 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.