పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) దేశాన్ని వీడినట్లు అనేక కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే అతడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌కు చేరుకున్నట్లు వార్తలొచ్చాయి. జట్టులో తన స్థానంపై అనిశ్చితి నెలకొనడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా సైతం కోడై కూసింది. తీరా చూస్తే.. అవన్నీ నిజాలు కావని తాను ఎప్పటికీ పాకిస్తాన్ పౌరుడినేనని సర్ఫరాజ్ మీడియా ముందుకొచ్చాడు.
తాను యునైటెడ్ కింగ్‌డమ్‌కు వలస వెళ్లినట్లు వచ్చిన వార్తలను సర్ఫరాజ్ అహ్మద్ కొట్టిపారేశాడు. మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లో నిజం లేదని నొక్కి చెప్పాడు. పాకిస్తాన్‌ను విడిచిపెట్టాలనే ఆలోచన కూడా తన మనస్సులో లేదని తెలిపాడు. అదే సమయంలో మీడియాపై కూడా విమర్శలు గుప్పించాడు.
"నేను పాకిస్తాన్‌ని విడిచిపెట్టాలనే ఆలోచన కూడా నా మనస్సులో లేదు. ఇలాంటి వార్తలు చూడడం చాలా బాధాకరం. మీడియా వారు కల్పిత వార్తలను బాగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రసారం చేసే ముందు నిర్ధారించుకోండి. నిజానిజాలేంటో తెలుసుకొని రాయండి.." అని సమా డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ మాట్లాడారు. సర్ఫరాజ్ చివరిసారిగా పాకిస్తాన్ తరుపున ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి టెస్ట్ ఆడాడు.
Sarfaraz Ahmed refutes rumors of moving to the United Kingdom for better opportunities.#PAKvNZ pic.twitter.com/1R2knfQCU9
— CricTracker (@Cricketracker) January 21, 2024