సెహ్వాగ్‌ను ఔట్ చేయడం చాలా సులభం: పాకిస్తాన్ మాజీ పేసర్

సెహ్వాగ్‌ను ఔట్ చేయడం చాలా సులభం: పాకిస్తాన్ మాజీ పేసర్

భారత విధ్వంసకర బ్యాటర్లు అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు.. వీరేంద్ర సెహ్వాగ్.  టెస్టులు, వన్డేలు, టీ20లు.. అన్న తేడా లేకుండా.. ఫార్మాట్ ఏదైనా సరే.. దూకుడుగా ఆడటమే వీరూ స్పెషాలిటీ. సెహ్వాగ్ క్రీజులో కుదురుకున్నాడంటే ఆరోజు రాత్రి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కలలో కూడా కనిపిస్తారు. అంతటి గొప్ప క్రికెటర్.. మన మాజీ డాషింగ్ ఓపెనర్. 

టీ20 ఫార్మాట్ మొదలయ్యాక ప్రస్తుత బ్యాటర్లు.. దూకుడుగా ఆడటం మొదలెట్టారేమో కానీ, మన వీరేంద్రుడు ఎప్పుడో మొదలెట్టేశాడు.  టీమిండియా ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన సెహ్వాగ్.. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాటర్. వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడు కూడా వీరూనే. ట్రిపుల్ సెంచరీ చేయడమే కష్టం అనుకుంటే.. సిక్సర్‌తో 300 మార్క్ అందుకున్న ధైర్యవంతుడు మన వీరేంద్రుడు. ఇలా చెప్పుకుంటూ పోతే సెహ్వాగ్ పేరిట బోలెడన్ని రికార్డులున్నాయి. 

అంతటి గొప్ప ఆటగాడిని పాక్ మాజీ పేసర్ రాణా నవీద్ ఉల్ హసన్.. అగౌరవ పరిచేలా మాట్లాడారు. నాదిర్ అలీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నవీద్ ఉల్ హసన్.. భారత బ్యాటర్లలో అతి సులభంగా ఔట్ చేయగల బ్యాటర్‌గా సెహ్వాగ్ పేరు చెప్పాడు. క్షణాల్లో అతన్ని ఔట్ చేయొచ్చు అంటూ బాంబ్ పేల్చాడు. అలాగే, అత్యంత కష్టతరమైన బ్యాటర్‌గా రాహుల్ ద్రవిడ్ పేరు చెప్పాడు. 'ది వాల్'గా పేరొందిన ద్రవిడ్ ను ఔట్ చేయాలంటే గంటల పాటు శ్రమించాల్సిందేనని అతను అంగీకరించాడు.

రాణా నవీద్ ఉల్ హసన్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ మాజీ ఆటగాళ్లకు నోటి దురుసు ఎక్కువని కౌంటరిస్తున్నారు. ఇలాంటి మాటల వల్లే భారత్‌తో మ్యాచ్ ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. నవీద్ ఉల్ హసన్ వ్యాఖ్యలపై సెహ్వాగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.