డబ్బుపై వ్యామోహం.. మరో పాకిస్తాన్ క్రికెటర్ రిటైర్మెంట్

డబ్బుపై వ్యామోహం.. మరో పాకిస్తాన్ క్రికెటర్ రిటైర్మెంట్

పాకిస్తాన్ పేసర్లు ఒకరివెంట మరొకరు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. వెటరన్ పేసర్ వాహబ్ రియాజ్.. ఆటకు గుడ్ బై చెప్పి 20 రోజులు గడవక ముందే మరో పాక్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫాస్ట్‌ బౌలర్‌ సోహైల్ ఖాన్‌  అంతర్జాతీయ, ఫస్ట్‌-క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ  విషయాన్ని అతను ట్విటర్(x) వేదికగా వెల్లడించాడు.

సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోహైల్ ఖాన్‌ తెలిపాడు. "నా సన్నిహితులతో క్షుణ్ణంగా పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), నా కుటుంబం, కోచ్‌లు, మెంటార్‌లు, సహచరులు, అభిమానులతో పాటు నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.  అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా.. దేశవాళీ వైట్ బాల్ క్రికెట్, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో నా కెరీర్‌ను కొనసాగిస్తా.." అని సోహైల్ ఖాన్‌ తన రిటైర్మెంట్ సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

39 ఏళ్ల సోహైల్ ఖాన్‌ 2007లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2008లో కెనడాతో జరిగిన టీ20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో 9 టెస్టులు, 13 వన్డేలు, ఐదు టీ20లలు ఆడిన అతడు.. మొత్తంగా 51 వికెట్లు పడగొట్టాడు. కాగా, సోహైల్ 2015 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం.

కాగా, ఇటీవల కాలంలో ప్రాంచైజీ క్రికెట్‌లో డబ్బు సంపాదించుకోవాలన్న ఆశతో పాక్ క్రికెటర్లు దేశానికి గుడ్ బై చెప్తున్న విషయం తెలిసిందే. వీరిలో కొందరు త్వరలోనే అమెరికా తరుపున ఆడనున్నారు.