న్యూయార్క్: అంతర్జాతీయ వేదికలపై చాన్స్ దొరికితే ఇండియాపై తప్పుడు ప్రచారాలతో విషం కక్కే తన అలవాటును పాకిస్థాన్ మరోసారి చాటుకుంది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మరోసారి తన పాత బుద్దిని బయటపెట్టింది. కశ్మీర్‌లో భారత సైనికులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కశ్మీర్ సమస్యకు అదే శాశ్వత పరిష్కారం అని భారత్ ప్రకటించుకుందంటూ కామెంట్ చేశారు. ఇటీవల మరణించిన కశ్మీర్ వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ గిలానీని గ్రేట్ కశ్మీర్ లీడర్ అంటూ ప్రస్తావించి.. ఆయన అంత్యక్రియల సక్రమంగా జరకుండా ఆర్మీ అడ్డుకుందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు ఇమ్రాన్. పైగా పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని, భారత్ సరిగా స్పందించడం లేదని ఆరోపించారు.
We heard the leader of Pakistan trying to justify act of terror, such defence of terrorism is unacceptable: Sneha Dubey, First Secretary at UNGA @MEAIndia pic.twitter.com/yIsdZ3SEuM
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) September 25, 2021
ఆ విషయంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు యూఎన్ సమావేశంలో భారత్ తిప్పికొట్టింది. అవాస్తవాలను ప్రచారం చేయడానికి పాకిస్థాన్ పదే పదే అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని ఇండియన్ ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే అన్నారు. ఇవాళ కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఉగ్రవాదాన్ని వెనకొసుకొచ్చారని, టెర్రరిజాన్ని ప్రపంచ దేశాలు ఆమోదించాలన్నట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తనను తాను తగులబెట్టుకుంటూ పైకి ఫైర్ ఫైటర్‌గా చెప్పుకుంటోందని, టెర్రరిస్టులను పెంచి పోషించడమే ఆ దేశం పాలసీగా పెట్టుకుందని, దీని వల్ల ప్రపంచమంతా ఇబ్బందులను ఎదుర్కొంటోందని స్నేహా దూబే అన్నారు. టెర్రరిస్టులను పోషించడంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, ఆ దేశం ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, ట్రైనింగ్, ఆర్థిక సాయం, ఆయుధాలు సప్లై చేయడం లాంటివి పాక్ ప్రభుత్వ పాలసీగా పెట్టుకుందన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పాక్ తమను తామే తగలబెట్టుకుంటోందని ఆమె చెప్పారు. బిన్ లాడెన్ సహా యూఎన్ భద్రతా మండలి గుర్తించిన టెర్రరిస్టులందరికీ పాక్ ఆశ్రయమిచ్చిందని, లాడెన్ మరణించాక అతడిని అమరుడంటూ పాక్ కీర్తించిందని స్నేహా గుర్తు చేశారు.
మా భూభాగాల నుంచి తక్షణం వెనక్కి పొండి
పాకిస్థాన్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ భారత్ మంచి సంబంధాలను కోరుకుంటోందని, కానీ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంలో నమ్మశక్యమైన చర్యలు తీసుకోవడం పాక్ బాధ్యత అని స్పష్టం చేశారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని భారత్ సహించేది లేదని స్నేహా చెప్పారు. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత కశ్మీర్‌లో భాగమేనని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ అక్రమంగా తమ చేతిలో పెట్టుకున్న ప్రాంతాలను తక్షణం విడిచి పెట్టి వెనక్కి పోవాలని ఆ దేశానికి పిలుపునిస్తున్నామని స్నేహా దూబే తెలిపారు.