భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ టీమ్ పాల్గొంటుందా లేదా అన్న సందగ్ధితకు తెరపడింది. వన్డే వరల్డ్ కప్లో ఆడేందుకు భారత్ లో పర్యటించేందుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 06వ తేదీ అనుమతి ఇచ్చింది. కానీ పాకిస్తాన్ టీమ్ భద్రతపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
రాజకీయాలకు క్రీడకు ముడిపెట్టొద్దు..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో పాల్గొనేందుకు పాక్ టీమ్ను భారత్ పంపిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. రాజకీయాలతో క్రీడలను ముడిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు అడ్డంకి కాకూడదని విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అయితే పాక్ జట్టు భద్రతపై ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని ఐసీసీ, బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
భద్రత విషయంలో మాకు..
వరల్డ్ కప్లో ఆడేందుకు పాక్ టీమ్ను భారత్ పంపిస్తున్నా..తమకు మాత్రం జట్టు భద్రతపై ఆందోళన కలుగుతోందని పాక్ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ టీమ్ భద్రత విషయంలో బీసీసీఐ, ఐసీసీలకు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశామని చెప్పింది. బీసీసీఐ, ఐసీసీల వద్ద పాకిస్తాన్ టీమ్ భద్రతను ప్రస్తావిస్తామని... భారత్‌లో పాకిస్తాన్ జట్టుకు పూర్తి రక్షణ ఉంటుందని తాము నమ్ముతున్నామని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
అసలేంటి వివాదం..
ఆసియా కప్ పాకిస్తాన్లో జరిగితే తాము భారత జట్టును పంపించబోమని బీసీసీఐ ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్ )కు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాల్గొనబోమని..పాక్ ఆడే మ్యాచుల వేదికలను మరో చోటకు మార్చాలని పాకిస్తాన్ తెగేసి చెప్పింది. అయితే ఆసియాకప్ను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చింది ఏసీసీ. కానీ వరల్డ్ కప్ మాత్రం భారత్ లోనే జరగుతుందని..పాక్ ఆడే మ్యాచుల వేదికలను మరో దేశానికి మార్చబోమని ఐసీసీ పేర్కొంది.ఈ అంశంపై బీసీసీఐతో పాటు ఐసీసీ కూడా పీసీబీతో చర్చించి వేదికల విషయంలో క్లారిటీ ఇచ్చాయి. కానీ పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయాన్ని పీసీబీ..పాక్ ప్రభుత్వానికి వదిలేసింది. దీంతో షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి దీనిపై నివేదిక కోరింది. మంత్రుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం....పాక్ జట్టు భారత్‌కు రావడానికి అంగీకారం తెలిపింది.
వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ షెడ్యూల్ :
- అక్టోబర్ 06 : పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ వేదిక హైదరాబాద్
- అక్టోబర్ 12 : పాకిస్తాన్ vs శ్రీలంక వేదిక హైదరాబాద్
- అక్టోబర్ 15 : పాకిస్తాన్ vs ఇండియా వేదిక అహ్మదాబాద్
- అక్టోబర్ 20 : పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా వేదిక బెంగళూరు
- అక్టోబర్ 23 : పాకిస్తాన్ vs అఫ్గానిస్తాన్ వేదిక చెన్నై
- అక్టోబర్ 27 : పాకిస్తాన్ vs సౌతాఫ్రికా వేదిక చెన్నై
- అక్టోబర్ 31 : పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ వేదిక కోల్‌కతా
- నవంబర్ 04 : పాకిస్తాన్ vs న్యూజిలాండ్ వేదిక బెంగళూరు
- నవంబర్ 12 : పాకిస్తాన్ vs ఇంగ్లాండ్ వేదిక కోల్‌కతా
గుజరాత్ లో నవరాత్రి ఉత్సవాలు ఉండటంతో..సెక్యూరిటీ సమస్య కారణంగా అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్ - పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 14నే నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. కానీ రీషెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు.