
కశ్మీర్ లోని పహల్గామ్ దాడికి ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులను అంతమొందించడానికి వేట కొనసాగిస్తోంది. జాడ దొరికితే చాలు వాళ్ల శరీరంలో బుల్లెట్లు దించాలని చూస్తోంది. అవసరమైతే పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్దమనే సంకేతాలు కూడా ఇస్తోంది భారత్.
ఈ క్రమంలో పహల్గామ్ లో 26 మందిని చంపిన టెర్రరిస్టులను కాపాడేందుకు పాకిస్తాన్ సాయం చేస్తోందని ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్తాన్ ఆర్మీ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయిస్తోందంట. టెర్రరిస్టులను షెల్టర్లు, బంకర్లకు తరలిస్తోందని ఇంటిలిజెన్స్ సమాచారం. పీవోకేలోని కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ వంటి కీలక ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఎల్ వోసీ వెంబడి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రతీకారంతో భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే భయంతో ఉగ్రవాద మౌలికసదుపాయాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
భద్రతా దళాలు ఇప్పటికే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా ఉన్న 42 ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలపై నిఘా పెట్టాయి. ప్రస్తుతం 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు పలు శిబిరాల్లో ఉన్నారని చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ టెర్రరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలుస్తోంది.