బంకర్లలోకి టెర్రరిస్టులు.. సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు ఖాళీ

బంకర్లలోకి టెర్రరిస్టులు.. సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు ఖాళీ
  • పీవోకే నుంచి వారిని తరలిస్తున్న పాక్
  • ఇండియా దాడి చేస్తదనే భయంతో నిర్ణయం
  • టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్  ఆర్మీ
  • సర్జికల్ స్ట్రైక్స్ అనుభవంతో ముందు జాగ్రత్త

న్యూఢిల్లీ: భారత సైన్యం మెరుపుదాడులకు దిగే అవకాశం ఉందని పాకిస్తాన్ టెన్షన్ పడుతోంది. గతంలో భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ అనుభవం నేపథ్యంలో ముందు జాగ్రత్త పడుతోంది. సరిహద్దులకు సమీపంలో, పీవోకేలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ఖాళీ చేయిస్తోంది. టెర్రరిస్టులను కాపాడుకోవడానికి వారిని బంకర్లలోకి, ఆర్మీ షెల్టర్లలోకి తరలిస్తోంది. దీంతో బార్డర్ కు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలు ఖాళీ అవుతున్నాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 

పహల్గాం లో ఉగ్ర వాదులు దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అమానవీయ దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గాం దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో మన సరిహద్దులకు ఆవల, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో టెర్రరిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి.

పీవోకే లో టెర్రర్ లాంచ్ ప్యాడ్లు

పీవోకేలో కొన్ని టెర్రర్ లాంచ్ ప్యాడ్ లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వాటిపై నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అయితే, ఈ స్థావరాలు సోమవారం ఖాళీగా మారాయని, పాక్ సైన్యం టెర్రరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్​లోని కీలక ప్రాంతాలైన కెల్, సర్డి, దుద్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్ఛిబన్, పార్వార్డ్ కహుతా, కోట్లి, ఖుయిరట్టా, మంధార్, నిఖైల్, చమన్ కోట్ ల నుంచి టెర్రరిస్టులను పాకిస్థాన్  తరలిస్తోందని సమాచారం. 

సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడేందుకు ముందు టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించడంలో ఈ స్థావరాలు కీలకమని అధికార వర్గాలు చెప్పాయి. ఇలాంటి అనువైన ప్రదేశాల నుంచి టెర్రరిస్టులను ఉన్నట్టుండి వేరేచోటికి తరలించడమంటే సర్జికల్ స్ట్రైక్స్ భయమే కారణమై ఉంటుందని పేర్కొన్నాయి.

కచ్చితమైన దాడులతో..

భారత భద్రతాబలగాలు కిందటి వారంలో కచ్చితమైన దాడులు జరిపి పీవోకేలోని 42 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల కోసం నిఘా పెట్టినపుడు సుమారు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు ఆయా స్థావరాల్లో ఉంటున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఈ క్యాంపుల్లో తాత్కాలికంగా ఆశ్రయం తీసుకుంటూ భారత్ లోకి చొరబడేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూసే వారని వివరించారు. 

సరిహద్దుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలతో పాటు పాక్ కు చెందిన 17 స్థానిక టెర్రర్ సంస్థలు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒకటైన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్​(టీఆర్ఎఫ్) కు చెందిన ఆరుగురు టెర్రరిస్టులు ఈ నెల 22న బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను బలితీసుకున్నారు.