Arshad Nadeem: పాకిస్థాన్ ఒలింపిక్ విజేతకు ఉగ్రవాదుల సన్మానం

Arshad Nadeem: పాకిస్థాన్ ఒలింపిక్ విజేతకు ఉగ్రవాదుల సన్మానం

ఇటీవల ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ గోల్డ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రాసహా మరో ఐదుగురితో పోటీపడిన అర్షద్ అగ్రస్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నాడు. దాంతో, అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొందరు భారతీయులూ మన ఏషియన్ ప్రాంతానికీ ఓ స్వర్ణం వచ్చింది కదా..! అని అతడిని పొగిడారు. తాజాగా, అతనికి ఐక్యరాజ్యసమితి(UN) నిషేధిత ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బహిర్గతమైంది. 

ఉగ్రవాదితో సంభాషణ

పాకిస్తానీ ఫీల్డ్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు నిషేధిత ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తెలిపేలా ఓ వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోలో అతను తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా(LeT) నాయకుడు హారిస్ ధార్‌తో సంభాషిస్తున్నాడు. నదీమ్ యొక్క ఒలింపిక్ అచీవ్‌మెంట్‌ను ధార్ ప్రశంసించడం కనిపిస్తోంది. 

లష్కరే తోయిబాను ఐక్యరాజ్యసమితి తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ హారిస్ ధార్ LeT ఉగ్రవాది, ముంబై పేలుళ్ల నూత్రధారి హఫీజ్ సయీద్ స్థాపించిన మిల్లీ ముస్లిం లీగ్ (MML) రాజకీయ పార్టీకి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. పాక్ అథ్లెట్ పారిస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ కలయిక జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. కాగా, ఇప్పటివరకూ ఈ వీడియోపై నదీమ్ నోరు మెదపకపోవటం గమనార్హం.