Pakistan Cricket: రిటైర్ అవ్వను.. మూడు వారాల్లో మళ్లీ తిరిగొస్తా..: పాకిస్తాన్ ఓపెనర్

Pakistan Cricket: రిటైర్ అవ్వను.. మూడు వారాల్లో మళ్లీ తిరిగొస్తా..: పాకిస్తాన్ ఓపెనర్

సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్‌ కనీసం గ్రూప్‌ దశ కూడా దాటలేకపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. ఇటువంటి తరుణంలో ఆ జట్టులో రిటైర్మెంట్ వార్తలు గుప్పుమన్నాయి. టోర్నీ ముగిశాక ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో, ఓపెనర్ స్పందించాడు.

రిటైర్మెంట్ వార్తలను ఫఖర్ కొట్టిపారేశాడు. అవన్నీ పుకార్లని ఒక్క మాటతో తేల్చి చెప్పాడు. థైరాయిడ్ సమస్య కారణంగా విరామం తీసుకుంటున్నాననే తప్ప రిటైర్ అవ్వాలనే ఆలోచనే లేదని ఈ ఎలెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.

"వన్డే ఫార్మాట్ నాకు ఇష్టమైన ఫార్మాట్. నేను థైరాయిడ్ తో బాధపడుతున్నా..కోలుకొని తిరిగి రావడానికి కాస్త సమయం పట్టవచ్చు. అంతే కానీ, రిటైర్ అవుతున్నాననే వార్తల్లో నిజం లేదు. మరికొన్నేళ్లు ఆడాలనుకుంటున్నా.. టీ20లు,వన్డేలు, టెస్ట్‌ల్లో మూడు ఫార్మాట్లలో దేశానికి మరోసారి విజయాలు అందించాలన్నదే నా తపన.."  

"ఇక నా పునరాగమనం విషయానికొస్తే, డాక్టర్‌తో మాట్లాడాను. నెలలోపు అని చెప్పారు. మూడు వారాల్లో శిక్షణ ప్రారంభించవచ్చని తెలిపారు. కావున నెలలోపే జట్టులోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తా.." అని ఫఖర్ అన్నారు.

ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో  ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో అతని స్థానంలో పీసీబీ ఇమామ్-ఉల్-హక్‌ను భర్తీ చేసింది.