ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే జట్టును పంపేదే లేదని బీసీసీఐ స్పష్టం చేయగా.. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించడం లేదు. ఈ విషయపై బీసీసీఐ, పీసీబీ, ఐసీసీల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. టోర్నీ ప్రారంభమయ్యే నాటికి భారత్ ఓ మెట్టు దిగి తమ దేశంలో పర్యటించకపోతుందా..! అన్న ఆశతో పాక్ ఉంది. ఇలాంటి పరిణామాల నడుపు ఆ జట్టు పేసర్ తన వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మా దేశానికి రండయ్యా.. అని భారత్‌ను అడుక్కోవడం మానుకోవాలని పాక్ పేసర్ సోహైల్ ఖాన్ ఆ దేశ క్రికెట్ బోర్డుకు సూచించాడు. ఇకపై భారత జట్టును పాకిస్థాన్‌కు పంపమని బీసీసీఐని అభ్యర్థించకూడదని, భవిష్యత్తులో పాకిస్థాన్ పొరుగు దేశంతో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని అభిప్రాయపడ్డాడు.
మనమే బహిష్కరిద్దాం..
"వాళ్లు లేకుంటే మనం క్రికెట్ ఆడలేమా? వారు పాకిస్థాన్ రావడానికి ఇష్టపడకపోతే వదిలేయండి. ఇంకెన్నాళ్లు బ్రతిమలాడతారు. ఇక్కడితో కథ ముగిసింది. ఇప్పటికే వారిని ఎన్నో మార్గాల్లో అభ్యర్థించాం. వాళ్లు కనుకరించడం లేదు. ఇక్కడితో పొరుగు దేశాన్ని అభ్యర్థించడం మానుకుంటే బెటర్. భవిష్యత్తులో వారితో మనం ఎలాంటి క్రికెట్ ఆడకూడదు.." అని సోహైల్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
Test cricketer Sohail Khan says Pakistan should not care about India in the matter of Champions Trophy. #CT25 pic.twitter.com/A04cDpNiHU
— Arfa Feroz Zake (@ArfaSays_) November 17, 2024
పీసీబీ కవ్వింపు చర్యలు
రెండ్రోజుల క్రితం పీసీబీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో సందర్శనకు ఉంచాలనుకుంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించగా.. ఐసీసీ దాయాది బోర్డుకు ఝలక్ ఇచ్చింది. వివాదాస్పద ప్రాంతాల్లో ట్రోఫీని ప్రదర్శించేందుకు అనుమతి లేదంటూ టూర్ రద్దు చేసింది. దాంతో, పీసీబీ టూర్ ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసుకుంది.