ODI World Cup 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ అఫ్రిది.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం

పాకిస్తాన్ స్పీడ్ గన్ షాహిన్ షా అఫ్రిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ తీసిన ఈ స్పీడ్ స్టర్.. ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. ఏ ఫార్మాట్‌లోనైనా నెం.1 ర్యాంక్‌ను చేరుకోవడం అతనికి ఇదే తొలిసారి.  

ఈ జాబితాలో 663 పాయింట్లతో అఫ్రిది తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజెల్ వుడ్(663 పాయింట్లు) రెండో స్థానంలో, భారత స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్(651 పాయింట్లు) మూడో స్థానంలో, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్(649 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉన్నారు. 

వంద వికెట్ల మైలురాయి

అలాగే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిన్ ఆఫ్రిది మరో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్ టాంజిద్ హసన్‌ను మొదటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చిన ఆఫ్రిది.. వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ వికెట్‌తో వన్డేలలో అత్యంత వేగంగా వంద వికెట్లు పడగొట్టిన తొలి ఫాస్ట్‌బౌలర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అప్రిది 51 మ్యాచ్‌ల్లో వందవికెట్ల మైలురాయిని చేరుకోగా.. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 52 మ్యాచ్‌ల్లో వందవికెట్ల ఘనతను అందుకున్నాడు.